అభ్యర్థుల్ని నిలబెట్టి అలా గాలికి వదిలేశారంటూ వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. ప్రచారం చివరి వారం మొత్తం విస్తృతంగా పర్యటించబోతున్నారు. ఒక్క జనసేన అభ్యర్థుల కోసమే కాకుండా.. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా కూడా ప్రచారం , రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. ఈనెల 22న హన్మకొండకు రానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ అభ్యర్థి కోసం ఎన్నికల ప్రచారం చేస్తారు. బీజేపీ వరంగల్ పశ్చిమ అభ్యర్థి రావు పద్మకు ఓటేయమని కోరుతారు.
ఈ నెల 25వ తేదీన తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్ధి ఎన్. శంకర్ గౌడ్ కు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించనున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో ఈనెల 26వ తేదీన పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గం నుండి బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కు మద్దతుగా సభలో పాల్గొంటారు. ఈ సభలో అమిత్ షా కూడా పాల్గొంటారు.
కూకట్ పల్లి, తాండూరులో ప్రచారం వరకూ ఖరారు అయింది. మిగిలిన ఆరు చోట్ల కూడా పవన్ ఒక్క సారి అయినా సభ లేదా రోడ్ షోలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ప్రచార గడువు 28వ తేదీతో ముగుస్తుంది. ఇప్పటి వరకూ జనసేన అభ్యర్థులు ఒంటరి పోరాటం చేస్తున్నారు. పవన్ రంగంలోకి దిగడంతో వారికి కాస్తంత మనోధైర్యం లభించే అవకాశం ఉంది.