చంద్రబాబుపై పెట్టింది తప్పుడు కేసులు. కళ్ల ముందు నిజాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా సాక్షిలో రాసింది.. తాము చెప్పినవే సాక్ష్యాలన్నట్లుగా అడ్డగోలుగా వాదిస్తూ.. కోట్లు ఖర్చు పెట్టి కోర్టుల చుట్టూ తిరుగుతోంది ప్రభుత్వం. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఇవాళ పిటిషన్ వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. వాదనల కోసం పొన్నవోలను ఢిల్లీకి పంపించే అవకాశం లేదని.. ముకుల్ రోహత్గీని మాట్లాడుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చింది. చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో సీఐడీ కనీస సాక్ష్యాలు చూపలేదని చెప్పింది. కానీ సాక్ష్యాలున్నాయని ఏసీబీ కోర్టు చెప్పిందని వైసీపీ వాదిస్తోంది. ఏసీబీ కోర్టుకు ఇచ్చిన సాక్ష్యాలేవో హైకోర్టుకు ఎందుకివ్వలేదంటే సమాధానం ఉండదు. ఏదేదో పిట్టకథలు చెప్పి అవే సాక్ష్యాలని నిరూపించాలని తాపత్రయ పడిపోతున్నారు. తమ వాదనలకు అనుగుణంగా తీర్పు ఇవ్వకపోతే నిందలేస్తు్నారు.
ఇప్పటికే స్కిల్ కేసులో 17ఏ పిటిషన్ పై తీర్పు రిజర్వులు ఉంది. అది ఈ నెలాఖరులోపు ఎప్పుడైనా రావొచ్చు. చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందంటే.. అసలు పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులని తేలిపోతుంది. అంతకంటే ముందే సాక్ష్యాలు లేవన్న సంగతి కూడా బయటపడింది. ఇంత జరుగుతున్నా సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం అనుకుంటోంది. సీఎం జగన్ రెడ్డి మానసిక స్థితిపై అందరూ ఏదో ఓ విధంగా వ్యాఖ్యలు చేయడం ఇలాంటి పరిణామాల వల్లే అనుకోవచ్చు.