సీఎం జగన్ రెడ్డిపై పులివెందులో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదును ఎస్ఐ నవ్వుతూ తీసుకున్నారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇలాంటి సీన్ ఊహించగలమా ?. ఏపీలో పోలీసులు అదీ పులివెందుల పోలీసులు జగన్ రెడ్డిపై రాజకీయ ఫిర్యాదును ఇలా తీసుకునే ధైర్యం చేస్తారా ? అంటే.. చేశారు.
భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్రయాదవ్ సీఎం జగన్‌పై కడప జిల్లా పులివెందులలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగన్ అవినీతిపై విచారణ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. . అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్త మొదలుకుని ముఖ్యమంత్రి జగన్ వరకు అంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పులివెందుల వాసి సీఎం జగన్.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే దోచుకోవడం మొదలుపెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మద్యం ద్వారా రూ.50 వేల కోట్లు, గ్రానైట్‌లో రూ.30 వేల కోట్లు, ఇసుక ద్వారా రూ.12 వేల కోట్లు, పారిశ్రామిక, చుక్కల భూముల ద్వారా రూ.20 వేల కోట్లు, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రూ.9 వేల కోట్లు, ఎర్రచందనం ద్వారా రూ.15 వేల కోట్లు, విద్యుత్ ఒప్పందాలు, కొనుగోళ్లతో రూ.10 వేల కోట్లు దోచుకున్నారు. పోర్టులు, అమూల్, బైజూస్ నుంచి కమీషన్లు, సినిమా, ఇతర పరిశ్రమల నుంచి వాటాలు.. ఇలా రూ.1.65 లక్షల కోట్లు వెనకేశారని పేర్కొన్నారు.
బయటకు రాని చీకటి జీవోలు, భూముల కేటాయింపుల ద్వారా ఇంకా అవినీతి జరిగిందన్నారు. దీనంతటికీ కారణం ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా గెలవడమేనని.. వెంటనే జగన్ అవినీతి వ్యవహారాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రామచంద్రయాదవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎలాంటి ఘటనలు జరిగిన పులివెందుల సంస్కృతి అని చెడ్డపేరు వస్తోందని.. జగన్ దమ్ము ధైర్యం ఉంటే అవినీతి చేయలేదని ప్రమాణం చేయాలని రామచంద్ర యాదవ్ సవాల్ చేశారు.
ఇప్పుడు ఆ ఎస్ఐను సస్పెండ్ చేస్తారో… వీఆర్ కు పంపుతారో లేకపోతే.. ఎన్నికలకు ముందు పోలీసులతో ఎందుకని సైలెంట్ గా ఉంటారో చూడాల్సి ఉంది.