చిరంజీవి కొత్త సినిమాని పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ చిత్రానికి‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా… యు.వి.క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రత్యేకమైన ఓ ఊహా ప్రపంచం నేపథ్యంలో సాగనుంది. ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. ఈ చిత్రానికి విశ్వంభర అనే పేరు పరిశీలనలో వున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఇందులో చిరంజీవి పాత్ర పేరుకూడా తెలిసింది. ఇందులో భీమవరం దొరబాబుగా అలరించబోతున్నారు చిరు. భీమవరం నేపధ్యంలో ఈ సినిమా మొదలౌతుందని సమాచారం. ఇందులో చిరంజీవి లుక్, గెటప్ కూడా విలక్షణంగా వుండబోతున్నాయి. చిరంజీవిలో చాలా మంచి కామెడీ టైమింగ్ వుంటుంది. ఇందులో ఆయన పాత్రని చాలా వినోదాత్మకంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు. దొరబాబు పాత్ర నవ్వులుని పంచుతూనే సాహస యాత్రకు తీసుకెళుతోందని, ఈ పాత్ర ప్రయాణం చాలా గమ్మత్తుగా వుటుందని సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాలో చిన్నారుల్ని అలరించే అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రం ఈనెల చివర్లో సెట్స్ పైకి వెళ్ళనుంది.