టీట్వంటీ మ్యాచులకి ఆదరణ పెరగడానికి కారణం గేమ్ టైం. ఒక సినిమా చూసిన సమయంలో గేమ్ పూర్తయిపోతుంది. ఆటలో కూడా వేగం వుంటుంది. మారుతున్న కాలం, అత్యధిక ప్రేక్షకులు అభిరుచులకు అనుగుణంగా ఆతని మార్పులు చేయడం.. టీ ట్వంటీ ఆదరణకు ప్రధాన కారణం. సినిమాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఇప్పుడు సినిమాకి వెళ్ళే ప్రేక్షకులు మూడ్ చాలా మారిపోయింది. ఒకప్పుడు సినిమా అంటే ఒక పూట మొత్తం కేటాయించేవాళ్ళు. రన్ టైం తో సంబంధం లేకుండా తీరిగ్గా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అంత తీరిక చాలా మందికి లేదు. టైంని ప్లాన్ చేసుకొని థియేటర్ రావడం పోవడం కలుపుకొని మూడు గంటల్లో సినిమా చూడటం పూర్తయిపోవాలి.
అలాగే సెలవు రోజుల్లో కాకుండా మామూలు రోజుల్లో సినిమాకి వెళ్ళే ఆడియన్స్.. రన్ టైంని కూడా పరిగణలో తీసుకుంటున్నారు. రెండు గంటలకు మించిన సినిమా వుంటే వారి ప్రాధన్యత ప్రకారం నిర్ణయం తీసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఫిలిం మేకర్స్ కూడా రన్ టైం విషయంలో చాలా ఖచ్చితంగా వుంటున్నారు. రెండు గంటల ఇరవై నిముషాలు దాటితే.. కత్తెరకి పని చెబుతున్నారు.
కానీ కొంతమంది ఫిల్మ్ మేకర్స్ మాత్రం తమ ప్రాడక్ట్ పై నమ్మకంతో మూడు గంటలకు మించి సినిమా చూపించడానికి ప్రత్నిస్తున్నారు. అయితే ప్రేక్షకుల నుంచి వస్తున్న రియాక్షన్స్ చూసి మళ్ళీ ట్రిమ్ చేస్తున్నారు. ఇటివల రవితేజ టైగర్ నాగేశ్వరరావుకి ఇలానే జరిగింది.
అయితే ”సినిమా బావుంటే జనాలు నాలుగు గంటలు కూడా చూస్తారు’ అనే ఓ హైపిచ్ స్టేట్మెంట్ వుంది. కొంత మంది ఫిల్మ్ మేకర్స్ దిన్ని బలంగా నమ్ముతారు కూడా. అర్జున్ రెడ్డి సినిమా తీసి అదే సినిమా బాలీవుడ్ రీమేక్ చేసి మళ్ళీ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ సినిమా చేస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు అదే మాటని బలంగా నమ్మాడు.
‘యానిమల్’కు సంబంధించిన ఓ విషయం ఇటివల నెట్టింట తెగ తిరిగింది. ఈ సినిమా రన్టైమ్ దాదాపు 3.20 గంటలు ఉండనుందని టాక్ వినిపించింది. ఇపుడు అదే నిజమైయింది. యానిమల్ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికేట్ ఇచ్చింది. మొత్తం రన్ టైం ఫ్రేమ్స్ తో సహా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు దర్శకుడు. ఈ సినిమా రన్ టైం 3 గంటల 21 నిమిషాల 23 సెకన్ల 16 ఫ్రేమ్స్. మొత్తానికి అన్నంత పని చేశాడు సందీప్ వంగా.
3 గంటల 21 నిమిషాలు అంటే వన్డే మ్యాచ్ లో 50 ఓవర్ల ఇన్నింగ్. ఈ మధ్యకాలంలో ఇంత నిడివి వున్న సినిమా రాలేదు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ లాంటి మల్టీ స్టారర్ ని మూడు గంటల ఆరు నిమిషాల్లో ముగించారు. కమల్ హసన్ తన దశావతారల్ని కూడా మూడు గంటల నాలుగు నిమిషాల్లోనే చూపించారు. ఎక్కువ రైన్ టైం అంటే గుర్తుకు వచ్చే సినిమా అమీర్ ఖాన్ లగాన్. దాదాపు మూడు గంటల నలభై నిమిషాల సినిమా అది. అయితే అప్పటికి ఇప్పటికి ప్రేక్షకుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి.
అయితే కంటెంట్ బావుంటే సీజన్ లకొద్ది వెబ్ సిరిస్ లు చుస్తున్నారు.. మూడున్నర గంటల సినిమా చూడలేరా ? అని ఓ అభిప్రాయం వ్యక్తమౌతుంటుంది. ఐదు సీజన్ ల మనీ హీస్ట్, బ్రేకింగ్ బ్యాడ్, మూడు సీజన్ ల నార్కొస్.. ఇలా వెబ్ సిరిస్ లని కాలంతో పని లేకుండా టీవీలకు అతక్కుంటూ చూస్తారు ఆడియన్స్. నిజమే… అయితే ఈ సూత్రం థియేటర్లో అప్లయ్ కాదు. ట్రాఫిక్ లో కార్ ఇరుక్కుంటే ఏదైనా సీజన్ కి సంబధించిన ఒక ఎపిసోడ్ చూసేవచ్చు. వెజిటబుల్స్ కట్ చేస్తూ ఇంకో ఎపిసోడ్ లేపెయొచ్చు. కానీ టికెట్టుకొని థియేటర్లో అడుగుపెట్టిన ప్రేక్షకుడి అంచనాలు వేరుగా ఉంటున్నాయి. ఎంత అద్భుతమైన కంటెంట్ వున్న కూడా తన వాచ్ ని చూసుకుంటున్నాడు ప్రేక్షకుడు. మరి ఈ టైం ఫ్యాక్టర్ ని యానిమల్ ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి.