తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిపై కేసులు భారీగా ఉన్నాయి. కాంగ్రెస్‌పార్టీ 118 స్థానాల్లో పోటీచేస్తుంది. ఈ అభ్యర్థుల్లో 84 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలోని బీజేపీ 111 స్థానాల్లో పోటీచేస్తుంది. ఆ అభ్యర్థుల్లో 78 మంది పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇక 12 స్థానాల్లోనే పోటీచేస్తున్న ఎంఐఎంపార్టీలో ఆరుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ 119 స్థానాల్లో పోటీచేస్తుండగా, వారిలో 58 మంది పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో అనేకమందిపై ఏండ్ల తరబడి కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి.
కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీచేస్తున్న 84 మంది అభ్యర్థులపై మొత్తం 540 కేసులు నమోదై ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ఆపార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రేవంత్‌రెడ్డిపై 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత ఖానాపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఆపార్టీ అభ్యర్థి వెడ్మా బొజ్జుపై 52 కేసులు ఉన్నాయి. మంచిర్యాల నుంచి పోటీచేస్తున్న కొక్కిరాల ప్రేంసాగర్‌రావుపై 32 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. బీఆర్ఎస్లో కరీంనగర్ స్థానం నుంచి పోటీచేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌పై అత్యధికంగా పది క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానం గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీచేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుపై 9 క్రిమినల్ కేసులు ఉన్నాయి. సీఎం కేసీఆర్ కుమారుడు, రాష్ట్ర మంత్రి, సిరిసిల్ల అభ్యర్థి కే తారకరామారావుపై 8 క్రిమినల్ కేసులు ఉన్నాయి.
బీజేపీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థుల్లో 78 మందిపై 549 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ఆపార్టీ అభ్యర్థిగా గోషామహల్ నుంచి పోటీచేస్తున్న రాజాసింగ్‌పై 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత కరీంనగర్ నుంచి పోటీచేస్తున్న బండి సంజరుకుమార్పై 59 కేసులు, బోథ్ నుంచి పోటీచేస్తున్న సోయం బాపూరావుపై 55 కేసులు నమోదై ఉన్నాయి. అయితే ఈ క్రిమినల్ కేసుల్లో అత్యధికం.. రాజకీయ కేసులే. గడచిన 9 ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాలపై పెట్టిన కేసులే అధికంగా ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ నేతలపై నమోదైన కేసులు .. ఉద్యమ సమయంలో నమోదైనవి.