రుషికొండ ప్యాలెస్ ను సొంతం చేసుకునేందుకు జగన్ రెడ్డి శరవేగంగా సన్నాహాలు చేసుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ. 433 కోట్ల ప్రజాధనం పెట్టి కట్టిన ప్యాలెస్ ను.. లీజుకు తీసుకునేందుకు ప్రముఖ హోటళ్లనుంచి బిడ్లను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించించిటనట్లుగా సమాచారం లీక్ చేశారు. నిజానికి పూర్తి సమాచారం బయటకు పంపలేదు. భవనాల నిర్వహణకే టెండర్లు పిలుస్తారని చెబుతున్నారు. కానీ నిర్వహణకు కాదని.. పూర్తిగా లీజు పేరుతో అప్పగించేందుకు ఇప్పటికే తెర వెనుక పనులు జరిగిపోయాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇరవై బెడ్ రూమ్లు ఉన్నాయి. మరో 70 రూములు ఏర్పాటు చేయాలని టూరిజం శాఖకు ప్రభుత్వం సూచించింది. అంటే మరిన్ని భవనాలు కడతారేమో చూడాల్సి ఉంది.
రుషికొండ కు బోడి గుండు కొట్టించి ఐదు వందల కోట్లతో కట్టిన ప్యాలెస్ టూరిజం ప్రాజెక్టు పేరుతో కట్టించారు. పూర్తిగా నిధులు కూడా అలాగే మంజూరు చేశారు. అక్కడ టూరిజం ప్రాజెక్టులు తప్ప మరేమీ నిర్మించకూడదు. అందుకే ఆ పేరుతో కట్టారు. కానీ దాన్ని కట్టింది జగన్ రెడ్డి క్యాంప్ ఆఫీసు కోసం. అందుకే అధికారుల కమిటీ ద్వారా నివేదిక ఇప్పించుకున్నారు. అయితే జగన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలవకపోయినా ఆ ప్యాలెస తనకే ఉంచుకునేలా ఓ కుట్ర చేశారు. అదే లీజు అని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
నిర్మాణం పూర్తి కాక ముందే జగన్ రెడ్డికి చెందిన బినామీ మనుషులకు లీజుకు ఇచ్చేశారని.. అంటున్నారు. 33 ఏళ్లు లీజుకు అగ్రిమెంట్ పూర్తయిందని అంటున్నారు. జగన్ రెడ్డి కుటుంబ కార్యక్రమంలాగా… రుషికొండ ప్యాలెస్ లో గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు కూడా. జగన్ రెడ్డి ఓడిపోయినా సరే .. లీజుకు తీసుకున్న భవనం కాబట్టి ముఫ్పై మూడేళ్ల పాటు ఖాళీ చేయించలేరని.. అక్కడే మకాం వేస్తారని అంటున్నారు. అసలు ఐదు వందల కోట్లు పెట్టిన ఆ కాంప్లెక్స్ కు ఎంత అద్దె నిర్ణయించారు.. ఎలా లీజుకు ఇచ్చారు.. అసలు లీజుకు తీసుకున్న కంపెనీ ఏది ? ఆ కంపెనీ జగన్ రెడ్డి ఉండటానికి ఎందుకు ఇస్తోంది ? ఇవన్నీ బయటకు రావాల్సిన విషయాలు.
ఇప్పుడు నిర్వహణకు టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని ప్రచారం చేస్తున్నారు. అసలు ఆ ఆదేశాల్లో ఏముందో బయటకు రావాల్సి ఉంది.