విక్రమ్ కె.కుమార్ కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తన స్క్రీన్ ప్లే విభిన్నంగా ఉంటుంది. 13 బి… హారర్ సినిమాల్లో ఓ వినూత్న ప్రయోగం. 24 కూడా కొత్త తరహా కథే. మనం అయితే ఓ మాస్టర్ పీస్. ఈమధ్య విక్రమ్ లయ తప్పాడు. తన మార్క్‌ని మళ్లీ చూపించుకొనే సమయం ఆసన్నమైంది. అందుకే ఈసారి తనకు అచ్చొచ్చిన క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్ తో ఓ వెబ్ సిరీస్ చేశాడు. డిసెంబరు 1 నుంచి అమేజాన్ లో ఈ ఓటీటీ ప్రసారం కానుంది. నాగచైతన్య కీలక పాత్ర పోషించాడు. ఈరోజు చైతూ పుట్టిన రోజు సందర్భంగా ట్రైలర్ విడుదలైంది.
ట్రైలర్లో విక్రమ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. హారర్, థ్రిల్లర్‌తో పాటు, ఓ సూపర్ నాచురల్ ఎలిమెంట్‌ని ఈ కథలో భాగం చేశాడు విక్రమ్. చైతూ ఇందులో ఓ జర్నలిస్టుగా నటించాడు. వరుస హత్యలు, వాటితో ముడిపడి ఉన్న కార్ట్యూన్లు, టైమ్ ట్రావెల్.. ఇలా ఈ కథలో చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేశాడు విక్రమ్. థ్రిల్లర్ ప్రియులకు ఈ వెబ్ సిరీస్ మంచి విందు భోజనంలా మారబోతోందన్న సంగతి అర్థమవుతూనే ఉంది. వెబ్ సిరీస్‌లో నటించడం చైతూకి కూడా తొలిసారి. కాబట్టి.. ఓటీటీ ప్రేక్షకుల్ని ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకొనే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.