చంద్రబాబు ప్రభుత్వం విశాఖలో సాఫ్ట్ వేర్ సంస్థల కోసం నిర్మించిన మిలీనియం టవర్స్ లో .. మంత్రుల కార్యాలయాలు పెట్టాలని జగన్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఆ మిలీనియం టవర్స్ లో ఉన్న కంపెనీలన్నింటినీ ఇప్పటికే వెళ్లగొట్టారు. ఆ భవనం ఖాళీగా ఉంది. ఉద్దేశపూర్వకంగానే దాన్ని ఖాళీగా ఉంచారని ఇప్పుడు మరోసారి స్పష్టమవతోంది. విశాఖ రిషికొండ మిలీనియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంప్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కమిట సిఫారసు చేసింది. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన సమయంలో భవనాల వినియోగంపై కమిటీ నివేదిక మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎం, మంత్రులు ఉత్తరాంధ్రలో సమీక్షలకు వెళ్లినప్పుడు ఉపయోగించేందుకు మిలినియం టవర్స్‌లో ఏ, బీ టవర్స్‌ను కేటాయించారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనల సమయంలో వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు. ఇలా కమిటీ సిఫారసు చేసిందని ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా చెబుతున్నారు. వివిధ శాఖలకు చెందిన సొంత భవనాలను ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు కేటాయించారు. సొంత భవనాలు లేని శాఖలు, అధికారుల కార్యాలయాలకు మిలినియం టవర్స్‌ను వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మొత్తం 2 లక్షల 27వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలు గుర్తించారు. మిలినియం టవర్స్‌లో లక్ష 75 వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పెస్‌ను గుర్తించారు. సీఎం క్యాంప్ ఆఫీస్ గా.. రుషికొండను బోడిగుండు చేసి కట్టిన ప్యాలెస్ ను వాడాలని ఇప్పటికే సిఫారసు చేశారు.