రాజ్యాంగానికి ఉపోద్ఘాతం(ప్రియంబుల్) ఎంత కీలకమైనాదో సినిమాకి ట్రైలర్ కూడా అంతే కీలకం. రాజ్యాంగ సారం ఉపోద్ఘాతంలో దర్శనమిస్తుంది. సినిమాలోని సారం కూడా ట్రైలర్ లో ప్రతిధ్వనిస్తుంది. ట్రైలర్ బట్టి సినిమాలో ఏముందో పసిగట్టేయోచ్చు. అయితే కొంత మంది ఫిల్మ్ మేకర్స్ ట్రైలర్ కట్ తో సినిమాపై హైప్ ని క్రియేట్ చేసి తర్వాత నిరాశపరిచిన సందర్భాలు వుంటాయి. కానీ చాలా మంది సినిమాలో ఏ పాయింట్ ని బలంగా చెప్పాలని భావిస్తున్నారో అదే పాయింట్ ని ప్రేక్షకుడికి పరిచయం చేసి ప్రిపేర్ చేయడం చాలా ముఖ్యం. ఇదే ఉత్తమ విధానం కూడా. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అదే చేశాడు.
రణ్‌బీర్ కపూర్ – రష్మిక జంటగా నటించిన చిత్రం ‘యానిమల్’. సందీప్‌రెడ్డి వంగా దర్శకుడు. ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్ ఆసక్తిని పెంచింది. మునుపెన్నడూ లేని రణ్‌బీర్ కనిపించాడు. పాటలు కూడా మెప్పించాయి. ఈ సినిమా మొదటి నుంచి తండ్రి కొడుకుల బంధం నేపధ్యంలో వుంటుదని హిట్ ఇస్తూనే వున్నారు. ట్రైలర్ లో అది ఇంకా స్పష్టంగా చూపించారు. ట్రైలర్ కట్ లో హైప్ జోలికి పోలేదు సందీప్. సినిమాలో కీ పాయింట్ ఏమిటో అదే చూపించాడు.
యాక్షన్ నేపధ్యంలో సాగే తండ్రి కొడుకుల డ్రామా ఇది. కథ కూడా పూర్తిగా రివిల్ చేసినట్లే. తండ్రి అంటే కొడుక్కి పిచ్చి. కానీ ఆ తండ్రి తన ప్రపంచంలో తాను ఉంటాడు. అలా తండ్రిపై విపరీతమైన పిచ్చితో పెరిగిన కొడుకు తండ్రి జాడల్లో నడుస్తాడు. ఇంతలో తండ్రిని ఎవరో చంపేస్తారు. వారిపై పగ తీర్చుకుంటాడు కొడుకు. ఈ ప్లోట్ అంతా ట్రైలర్ లోనే చెప్పేశారు. అయితే ఈ డ్రామా ఎంత ఆసక్తిగా వుంటుంది? పాత్రలని ఎంత కొత్తగా డిజైన్ చేశారు ? ఆ పాత్రల తీరు ఎంతలా ఆకట్టుకుంటుందనే అంశంపైనే సినిమా ఫలితం ఆధారపడివుంది.
దర్శకుడు సందీప్, తొలి సినిమాకి దీనికి పూర్తి వైవిధ్యం చూపించడం బావుంది. ‘కొడుకు పగ తీర్చుకుంటాడు’ ఈ పాయింట్ తో బోలెడు సినిమాలు వచ్చాయి. ఐతే ఈ పాయింట్ ని సందీప్ ఎలా ప్రజెంట్ చేశాడనేది అసలు పాయింట్. రణబీర్ కి ఇది కొత్త పాత్రే. పూర్తి వైల్డ్ గా కనిపించాడు. చివర్లో కేజీఎఫ్, విక్రమ్, ఖైదీ తరహలో ఓ పెద్ద మిషన్ గన్ ఐటెం వుంది. ఇది కొంచెం పాన్ ఇండియా సెంటిమెంట్ అనిపించింది. సినిమాలో ఎలా పే చేస్తుందో చూడాలి.
తెలుగు వెర్షన్ డబ్బింగ్ మాత్రం కొంచెం తేడాగానే వుంది. రణబీర్, అనిల్ కపూర్ తెలుగులో పలికిన మాటలు సహజత్వాన్ని పలికించలేదు. ఆ ఎమోషన్ కనెక్ట్ కావాలంటే హిందీ అర్ధమైనవాళ్ళు ఆ భాషలో చూడటమే ఉత్తమం. పైగా కొన్ని మాటలని స్వేచ్చానువాదం పేరుతో చెడగొట్టినట్లు అనిపించింది. ఇందులో హీరో చెప్పే సిగ్నేచర్ ‘దునియా జాలంధూగా’ డైలాగ్ ని తెలుగులో ‘ఢిల్లీ తగలబెట్టేస్తాను’అని మార్చారు. దునియా స్థానంలో ఢిల్లీ అని వాడారు. బహుసా ఈ కథ ఢిల్లీలో జరగొచ్చు. అయితే ఢిల్లీ కంటే దునియా అనే మాటే చాలా సులువుగా జనాల్లోకి వెళుతుంది. కేజీఎఫ్ రూపంలో అది పాపులర్ కూడా. అయితే డబ్బింగ్ సినిమాలకి ఇది సామాన్యంగా ఎదురయ్యే సమస్యే. అందుకే ముందు జాగ్రత్తగా చాలా వరకూ ఇంగ్లీష్ పదాలనే వాడారు.
మొత్తానికి యానిమల్ లో ఏముందో ట్రైలర్ లో చూపించారు. 3 గంటల 21 నిమిషాల నిడివి చిత్రమిది. ఇంత నిడివి ఎందుకు పెట్టుకున్నారో ట్రైలర్ చుస్తే అర్ధమైయింది. కేవలం యాక్షన్ సినిమా కాదిది. దీనికి బలం డ్రామా. ఈ తండ్రికొడుకుల డ్రామా ఎంతలా పడుతుందనే పాయింట్ పై యానిమల్ ఫలితం ఆధారపడివుంది.