” ప్రజాస్వామ్యం అంటే నేరాలు చేసి నేతగా గుర్తింపు పొంది ఎన్నికల్లో పోటీ చేసి డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కుని.. గెలిచిన తర్వాత ప్రజల్ని దోచుకునే వ్యాపారం ” .
కాదని ఎవరైనా చెప్పగలరా ?. నాది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఉన్న దేశం. ఇవి నిజమే. మరి మన ప్రజాస్వామ్య విలువలు ఏ స్థాయిలో ఉన్నాయి ?. ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే దేశంలోనూ లేని అష్ట దరిద్రాలన్నీ భారత ప్రజాస్వామ్యానికి పట్టాయి. ఓట్లు కొంటారు. కులాల్ని ఎగదోస్తారు. మతాల్ని రెచ్చగొడతారు. మన ప్రాంతం మనకు ముఖ్యమంటారు. ఒకరిపై ఒకర్ని ఎగదోసి.. వాళ్లను వేధిస్తాం మాకు ఓటు వేయమంటారు. ఈ అరాచకాలకు తోడు.. ఎన్నికల్లో నిలబడగలగవచ్చు అనుకునే సామాన్యుల సంఖ్య అమాంతం పడిపోతోంది. ఎవరైనా నిర్భయంగా ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి వచ్చింది. ప్రస్తుత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడిన వారిని చూస్తే.. అత్యధికం ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎన్నికల వాహనాలు.. ఏజెంట్లు వంటి అవసరాలను తీర్చుకోవడానికి నిలబడిన అనుచరులే..కానీ సీరియస్ పోటీ దారులు కాదు. కొంత మంది ప్రధాన అభ్యర్థుల్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజుకుందామని నిలబడతారు. అంతే కానీ యువత .. రాజకీయాల్లోకి రావాలని.. పరిస్థితి మార్చాలని వచ్చే చాన్స్ లేదు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ యువత రాజకీయాల్లోకి రావాలంటాయి కానీ..అలాంటి అర్హతల్ని మాత్రం.. భిన్నంగా నిర్దేశిస్తారు. అయితే భారీ ఎత్తున కేసులతో రౌడీ అయినా అయి ఉండాలి.. లేకపోతే వారసుడు అయినా అయి ఉండాలి. లేకపోతే రాజకీయ నాయకుడిగా పరిగణించరు.
ఇప్పుడు యువనేతలంటే వారసులు లేదా రౌడీలు
రాజకీయాల్లోకి యువత రావాలని ఓ పార్టీ అధినేత పిలుపునిస్తూంంటే.. అమెరికాలో ఉన్న యువుకుడు మాతృదేశానికి వచ్చి.. ఎన్నికల్లో నిలబడి ప్రజాప్రతినిధిగా తాను ఏదో సేవ చేయాలనుకుంటాడు. తన ప్రోఫైల్ రెడీ చేసుకుని తాను ఎంత గొప్పగా చదువుకున్నానో .. ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించానో.. ప్రజాసమస్యలపై ఎలాంటి అవగాహన ఉందో చెబుతూ.. పార్టీల కార్యాలయాల చుట్టూ తిరుగుతాడు. కానీ అందరూ ఈ యువకుడ్ని పిచ్చోడ్ని చూసినట్లుగా చూస్తారు. ఇండియా ప్రజాస్వామ్యంలో రాజకీయ నేతలు కావాలంటే.. ముందు రౌడీగా మారాలి. నేరాలు చేయాలి. కేసులు పెట్టించుకోవాలి. పది మందిని భయపెట్టే పరిస్థితికి తేవాలి. ఈ క్రమంలో డబ్బులు సంపాదించుకోవాలి. ఆ తర్వాత టిక్కెట్ కోసం ప్రయత్నించాలి. అటు రౌడీయిజం.. ఇటు ధన బలం ఉంటేనే నాయకుడిగా రాజకీయ పార్టీలు గుర్తిస్తాయి. లేకపోతే.. అప్పటికీ రాజకీయ నాయకుడు అయిన వారి వారసుడు అయిన అయి ఉండాలి. ఇక్కడ రాజకీయ పార్టీల తప్పేం లేదు. ఎందుకంటే.. అలా బాగా చదువుకుని రాజకీయాల్లోకి వచ్చిన వారిని నిలబెడితే ప్రజలు కూడా ఓట్లు వేయరు. మంచి చేస్తామని..నేను ఇంత చదువుకున్నామని చెప్పి.. నీట్ గా షేవ్ తో డ్రెస్ టక్ చేసుకుని కనిపిస్తే పప్పు అనే ముద్ర వేస్తారు. ఎదురగా ఉన్న రౌడీ నేతలు.. అదే పని చేస్తారు. దీంతో ప్రజలు మరింత చులకనగా చూస్తారు కానీ నాయకుడిగా ఎంచుకోరు. నాయకుడు అవ్వాలంటే.. ఆ చదువుకున్న యువకుకుడూ కూడా చెడిపోవాలి. రాజకీయ నేత అనిపించుకునే అర్హతలు తెచ్చుకోవాలి. ఇలాంటి పరిస్థితి ప్రజల వల్లే వస్తుందని.. రాజకీయాలకు యోగ్యమైన వారిని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఓటర్లకు.. ప్రజలకు ఉంది.కానీ వారు కూడా రౌడీలకే.. అవినీత పరులకు.. ధనవంతులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే ప్రజాస్వామ్యంపై రాను రాను నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తోంది. ప్రజాస్వామ్యం అందరిదీ కాదని.. సామాన్యులది అసలు కాదని అనుకునేంత వరకూ వచ్చింది. కానీ ఇలాంటి సమయంలో.. తెలంగాణ ఎన్నికల్లో ఓ ఆశాకిరణం వెలుగులోకి వచ్చింది. ఆ ఆశాకిరణం పేరు శిరీష ఉరఫ్ బర్రెలక్క. ఈమె ఎన్నికల బరిలో నిలబడటం విశేషం కాదు… ఆమెకు లభిస్తున్న మద్దతు మాత్రం ఖచ్చితంగా విశేషమే. ప్రజల్లో చైతన్యం ఉందని.. తట్టి లేపితే… మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చని ధైర్యం కలిగించే స్పందనే అది.
శిరీష ఉరఫ్ బర్రలెక్కకు మద్దతుతో ప్రజా చైతన్యం
బర్రెలక్క అలియాస్ శిరీష. ఇప్పుడు సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్న పేరు. ఆమె ఏదో సాధించలేదు. కేవలం ఎన్నికల్లో పోటీ చేస్తోంది అంతే. ఎన్నికల్లో పోటీ చేస్తేనే ఇంత హైప్ రాదు. కానీ శిరీష అన్ని రకాల ఆటంకాలను మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొంటోంది. దేనికీ భయపడటం లేదు. తన దగ్గర డబ్బుల్లేవని అనుకోవడం లేదు. తనతో పాటు వందల మంది వస్తారని అనుకోవడం లేదు. కానీ ధైర్యంగా వెళ్తోంది. ప్రచారం చేస్తోంది. ఓటు అడుగుతోంది. ఎన్నికలు అంటే.. కోట్లు ఉన్న వారికి.. బలం, బలగం ఉన్న వారికే కాదు. అతి సామాన్య కుటుంబంలో అత్యంత సామాన్య వ్యక్తులకూ అవకాశం ఉందని శిరీష చూపిస్తోంది. అందుకే సంచలనంగా మారింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ప్రజాస్వామ్యం ఇప్పుడంతా ఖరీదు కాలేదు. అప్పట్లో ఎవరైనా ఎన్నికల్లో పాల్గొనేవారు. డబ్బు అనేది పెద్ద విషయం కాదు. సమాజం కోసం ప్రజల కోసం పోరాడేవారిని ఎన్నుకునేవారు. డబ్బు పంపిణీ అనే మాటే ఉండేది కాదు. అలా ప్రారంభమైన ఎన్నికల ప్రజాస్వామ్యం ఇప్పుడు రౌడీల రాజ్యం అయిపోయింది. ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద లీడర్ అవుతున్నారు. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడతారనేది పోటీకి అర్హతగా మారింది. ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్రులు.. యువత.. రాజకీయ నేపధ్యం ఉన్న వారు కనిపించడం లేదు. పోటీలో ఉండేవారు ప్రధాన అభ్యర్థులకు వాహనాలు, పోలింగ్ ఏజెంట్ల కోసం అన్నట్లుగా నిలబడుతున్నారు. ఇలాంటి పరిస్థితి శాశ్వతం కాదని మార్పు తెచ్చకోవచ్చని శిరీష్ నిరూపిస్తున్నారు. భారత ప్రజాస్వామ్య గొప్పదనం ఏమిటంటే ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చు. కులం, మతం అనేవే కాదు విద్యార్హతలు కూడా లేవు. వయసు నిబంధనలు అసలు లేవు. కానీ ఈ ఫ్లెక్సిబిలిటీ చివరికి బలవంతుల రాజ్యంగా మారడానికి కారణం అయింది. బలహీనులు ఓటు వేయడానికి కూడా జంకాల్సిన పరిస్థితి.ఇక పోటీ చేయడమా. భయపడితే.. అంతే ఉంటుందని.. ధైర్యంగా అడుగు వేస్తే మన ప్రజాస్వామ్యం ఇప్పటికీ వెలుగులీనుతుందని బర్రెలక్క అలియా శిరష నిరూపిస్తున్నరు.
ఒక్క వీడియోతో పాపులర్ – ఎన్నికల్లో నిలబడి ప్రజల మద్దతు పొందిన శిరీష
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్ల్లిలో నిరుద్యోగ యువతి శిరీష. బీఈడి రెండో సంవత్సరం చదువుకుంటున్న శిరీష గతంలో పోలీసు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయడంలో నిర్లక్ష్యం కారణంగా భర్తి కాలేదు. దీంతో నాలుగు బర్రెలు కొనుక్కున్నానని తెలంగాణ యువత కూడా అదే చేయాలని సెటైరిక్‌గా వీడియో విడుదల చేశారు. ఆమెకు వేధింపులు వచ్చాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతావా అని బెదిరింపులూ ఎదుర్కొన్నారు. కేసులు కూడా పెట్టారు. అయినా తగ్గలేదు. ఎన్నికల్లో నిలబడి నిరుద్యోగుల ఆవేదనను ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. డానికి కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆమె బరిలో నిలిచారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నిరుద్యోగుల బతుకులు మారుతాయన్న పాలకుల మాటలు నీటి మూటలు అయ్యాయి. అందుకే పాలకుల కనులు తెరిపించడానికి కొల్లాపూర్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో తాను సైతం పోటీ చేస్తున్నానని శిరీష చెబుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిరీషకు నియోజకవర్గమే కాదు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. నిరుద్యోగులకు న్యాయం జరిగే దాకా తాను అలుపెరుగని పోరాటం చేస్తానని ఆమె చెప్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులకు ప్రత్యేక ప్రయోగాత్మకంగా కొల్లాపూర్ శాసనసభకు నిలబడుతున్నానని శిరీష ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనను తాను బర్రెలక్క గానే ప్రమోట్ చేసుకుంటున్నారు శిరీష. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నిరుద్యోగి శిరీషా తనకు ఒక్కసారి ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని, భవిష్యత్ ను మారుస్తానని చెబుతూ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క ఎన్నికల ప్రచారం ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ప్రత్యేకంగా మేనిపెస్టోను కూడా రిలీజ్ చేసింది.
గెలవకపోవచ్చు కానీ శిరష స్ఫూర్తి మంత్రం మాత్రం గొప్పది !
ఆన్ లైన్ చైతన్యంతో అద్బుతాలు జరుగుతాయని ఇప్పటికీ అనేక సార్లు వెల్లడయింది. ఇప్పుడు అలాంటి విప్లవం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. శిరీష కొల్లాపూర్ లో పోటీ చేస్తున్నారు. ఆ నియోజకవర్గం అర్బన్ ప్రాంతం కాదు. అక్కడ సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. శిరీషకు వస్తున్న మద్దతులో అత్యధికం బయట ప్రాంతాల నుంచే. ఓట్లు వేసే వారు కాదు. శిరీష విజయం సాధించాలంటే.. కొల్లాపూర్ ఓటర్లలో చైతన్యం రావడం ముఖ్యం. అయితే సోషల్ మీడియా కేంద్రంగా జరుగుతున్న ప్రచారం ఖచ్చితంగా కొల్లాపూర్ ఓటర్లలో చర్చనీయాంశం అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. శిరీష కొల్లాపూర్ లో నామినేషన్ వేసినప్పుడు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఆమె అందరికీ తెలుసు. ఇందు కోసం ఆమె కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇవ్వలేదు. కనీసం ప్రచార వాహనాలను సైతం ఏర్పాటు చేసుకోలేకపోయారు. కానీ ఆమె స్ఫూర్తి నచ్చి.. చాలా మంది దాతలు ఆర్థిక సాయం పంపుతున్నారు. కొల్లాపూర్ లో ఇద్దరు ఉద్దండులు ప్రధాన పార్టీల తరపున పోటీ పడుతున్నారు. వారికి బర్రెలక్క శిరీష గట్టి పోటీ ఇచ్చేలానే ఉన్నారు. ఈ పరిణామం రాజకీయాలంటే.. మనకు కాదు అనుకునే ప్రతి ఒక్కరిలో మార్పు తెస్తుందని అనుకోవచ్చు. అక్రమార్కులు, బలవంతులు ప్రజాస్వామ్యాన్ని ఆక్రమించేసుకుని నిజాయితీ పరులు, సామాన్యులకు చోటు లేదని తేల్చేస్తున్న సమయంలో శిరిష లాంటి వారి ప్రయత్నం .. ఆశలు రేపుతోంది. శిరష గెలిస్తే అదో సంచలనం.. గెలవకపోయినా.. రాజకీయాల్లో ఎదగడానిక ఎవరికైనా అవకాశం ఉంటుందని నిరూపించినట్లు అవుతుంది. భారత ప్రజాస్వామ్యానికి ఇలాంటి శిరీషలే బలం అవుతారు. రేపు శిరీష గెలవొచ్చు లేకపోవచ్చు..కానీ ప్రభుత్వాలపై పోరాటానికి.. ప్రజాస్వామ్యల పరిష్కారానికి.. యువత ముందుకు రావడానికి శిరీష ఓ కారణంగా నిలుస్తారనడంలో సందేహం లేదు.
ప్రజాచైతన్యాన్ని కదిలిస్తే రాజకీయ విప్లవమే !
రాజకీయ పార్టీలన్నీ యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తూ ఉంటారు. కానీ వారసులకు.. రౌడీయిజం చేసి వచ్చే వారికి తప్ప.. చదువుకున్న వారికి సీట్లివ్వరు. దానికి వారు చెప్పే కారణం.. చదువుకున్న బుద్ది మంతులకు ప్రజలు ఓట్లేయరని. అంటే లోపం ప్రజలు.. ఓటర్లలోనే చూపిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఇప్పుడు ఈ పరిస్థితిని మార్చాల్సిన సమయం వచ్చింది. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ఓటర్లే కాబట్టి.. మార్పు అనేది వారి దగ్గర్నుంచే రావాల్సి ఉంది. శిరీషకు లభిస్తున్న మద్దతుతో ఓటర్లు అదేదారిలో ఉన్నారని అర్థమైపోతుంది. కానీ పూర్తి స్థాయిలో మార్పు వచ్చినప్పుడు మన దేశ ప్రజాస్వామ్యం.. సరైన ట్రాక్ లోకి వస్తుంది. డబ్బు, మద్యం , కులం, మతం అనే జాడ్యాలను వదిలించుకుంటుంది. అత్యున్నత ప్రజాస్వామ్య దేశంగా నిలబడుతుంది. దీన్ని అంది పుచ్చుకుని రాజకీయ కదనరంగంలోకి దిగాల్సింది యువతే. వారు పట్టుకుంటే.. రాజకీయాలు స్వచ్చంగా మారిపోతాయి. దేశ భవిష్యత్ కూడా మారిపోతుంది.