హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ నేతలు గ్రూపులు, గ్రూపులుగా మారిపోయి ముందుగానే బాలకృష్ణకు భారీ మెజార్టీ ప్రకటిస్తున్నారు. హిందూపురంలో వైసీపీ నేతలు ఇలాగే ఉంటే.. దీపికకు గెలిచే అవకాశం లేదని పైగా మెజారిటీ రెట్టింపు అవుతుందని ప్రకటించారు. దీంతో వైసీపీలో ఒక్క సారిగా కలకలం రేగింది. గత ఎన్నికల్లో బాలకృష్ణపై పోటీ చేసి ఓడిపోయిన ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి దక్కింది. అయితే హిందూపురం నుంచి ఆయనను ఇటీవలి కాలంలో అవమానకరంగా వెళ్లగొట్టారు. చెప్పా పెట్టకుండా దీపికారెడ్డి అనే ఎవరికీ తెలియని మహిళను ఇంచార్జ్ ను చేశారు. అప్పటికే నవీన్ నిశ్చల్ తో పాటు మరో రెండు వర్గాలు ఉన్నాయి. దీపికారెడ్డి ఎవరు అంటే.. ఓ రెడ్డి సామాజికవర్గనాయకుడికి భార్య. ఆ నాయకుడు హిందూపురానికి చెందిన వారు కాదు.
కానీ కర్ణాటకలో వ్యాపారాలు చేస్తూ బీజేపీ నేతగా చెలామణి అవుతున్న బాబురెడ్డి అనే వ్యక్తి.. మంత్రి పెద్దిరెడ్డి ద్వారా చక్రం తిప్పి.. దీపికారెడ్డిని ఇంచార్జ్ గా నియమించారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న దీపిక కురుబ వర్గానికి చెందిన వారని చెబుతున్నారు. ఎంపీ మాధవ్ కు చెక్ పెట్టాలని ఇప్పటికే డిసైడ్ అయ్యారు. కురుబవర్గానికి ప్రాధాన్యం తగ్గనివ్వలేదని .. దీపికకు హిందూపురం అసెంబ్లీ ఇంచార్జ్ ఇచ్చారు. అయితే అక్కడ పని చేసుకుంటున్న వారు మాత్రం అసంతృప్తికి గురయ్యారు.
ఇక్బాల్ అవమనంతో మూడు నెలల పాటు హిందూపురంకు రాలేదు. శుక్రవారమే హిందూపురంకు వచ్చారు. ఆయన వస్తున్నారని తెలిసి.. ఎవరూ కలవకుండా కట్టడి చేశారు బాబురెడ్డి అనే నేత. ఈ కారణంగానే బాలకృష్ణపై మెజారిటీ వ్యాఖ్యలు చేశారు. అయితే బాబురెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్సీ ఇక్బాల్ ను బండబూతులు తిట్టారు. ఇక్బాల్ మాజీ ఐపీఎస్. ఐజీగా చేసి రిటైర్ అయ్యారు. చంద్రబాబు సీఎంగా ఉన్న ఆయనకు వ్యక్తిగత భద్రతాధికారిగా కూాడా పనిచేశారు.