సీఎం జగన్ రెడ్డి విశాఖ ఐటీ రంగాన్ని వైట్ వాష్ చేస్తున్నారు. రుషికొండ చుట్టూ ఆయన రాజ్యం ఏర్పాటవుతూండటంతో అక్కడ ఉన్న చిన్నా చితకా ఐటీ కంపెనీలన్నీ సర్దుకుని వెళ్లిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే మిలీనియం టవర్ లో సెక్రటేరియట్ పెట్టాలన్న ఉద్దేశంతో ఐటీ కంపెనీలన్నింటినీ తరిమేశారు. కనీసం పాతిక వేల మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి.
మిలీనియం టవర్ ను చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిర్మించారు. పెద్ద ఎత్తున కంపెనీలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఐదేళ్లలో నిర్మించడమే కాకుండా.. కంపెనీలను రప్పించారు. జగన్ రెడ్డి సర్కార్ వచ్చే సమయానికి కాండ్యూయెంట్ లాంటి కంపెనీలు ఉన్నాయి. పది వేల మంది పని చేసేవారు. ఇ ప్పుడు ఎవరూ లేరు. అది ఒక్కటే కాదు రుషికొండ ఐటీహిల్స్ మొత్తం అదే పరిస్థితి. నాలుగు కంపెనీల్ని తీసుకు వచ్చి ఐటీ ఉద్యోగాలు కల్పిస్తారని యువత అుకుంటారు. కానీ ఐటీ హిల్స్ మొత్తాన్ని ట్రాన్సిట్ అకామిడేషన్ కోసం కబ్జా చేస్తారని ఎవరూ అనుకోలేదు. జరుగుతోంది అదే.
సీఎం జగన్ విశాఖ వస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయో అక్కడి ప్రజలకు ఇప్పటికే చాలా సార్లు అనుభవమైంది. ఇప్పుడు రుషికొండ మొత్తం … పరదాల పరిధిలోకి వెళ్లిపోతుంది. అక్కడి ప్రజలు నరకం చూడబోతున్నారు. ఏ కంపెనీ అయినా కనీస మౌలిక సదుపాయాలు.. స్వేచ్చ ఉండేలా చూసుకుంటుంది. రావాలనుకునే కంపెనీలు కూడా విశాఖకు రావు. విశాఖను రాజధాని పేరుతో ఇంత ఘోరంగా విధ్వంసం చేసిన ప్రభుత్వం మరొకటి లేదని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.