ప్రస్తుతం తెలంగాణాలో తెరాస అధికారంలో ఉంది కనుక ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి దూకేసి, అటువంటి గొప్ప అవకాశం తమకే లభించినందుకు చాలా సంబరపడిపోతున్నారు. వారి నిర్ణయం సరయినదో కాదో తెలుసుకోవాలంటే రాష్ట్రంలో ప్రస్తుత, భవిష్యత్ రాజకీయ పరిస్థితులు, పరిణామాలను పరిగణనలోకి తీసుకొని చూడవలసి ఉంటుంది.
ఇంతవరకు తెలంగాణాలో జరిగిన అన్ని ఎన్నికలలోనూ తెరాస ప్రభుత్వం వరుస విజయాలతో దూసుకుపోతోంది. అదే సమయంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. ఇప్పటికే తెదేపా దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. జాతీయ పార్టీలయినా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా తెరాస ధాటిని తట్టుకోలేకపోతున్నాయి. వచ్చే ఎన్నికలలో అయినా కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేదు. నాయకత్వ లక్షణాలు ఏమాత్రం లేని రాహుల్ గాంధీని ముందుంచుకొని సాగుతుండటం వలన దాని విజయావకాశాలు సన్నగిల్లుతున్నాయి. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే కనుక అ పార్టీ నేతలు తెరాసలో చేరడం వలన ఎంతో కొంత లాభమే తప్ప నష్టపోరని చెప్పవచ్చును.
ఇక వరుస ఓటముల కారణంగా రాష్ట్రంలో తెదేపా-బీజేపీల సంబందాలు కూడా దెబ్బ తింటున్నాయి. ఆ కారణంగా ఏదో ఒకరోజు అవి కటీఫ్ చెప్పేసుకొని విడిపోయినా ఆశ్చర్యం లేదు. అప్పుడు తెదేపా ఇంకా దెబ్బ తినవచ్చును. ఏదో ఒకరోజు తెరాస ఎన్డీయేలో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. కనుక తెరాస, బీజేపీలు చేతులు కలిపితే తెరాస ఇంకా బలపడవచ్చును.ఒకవేళ అవి కలవక పోతే, తెదేపా, కాంగ్రెస్ పార్టీల అంతు చూసాక బీజేపీపై కేసీఆర్ దృష్టి పెట్టడం ఖాయం. అప్పుడు ఆయన ధాటికి బీజేపీ కూడా తట్టుకోలేకపోవచ్చును.
రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం విషయంలో కూడా తెరాస ప్రభుత్వం చాలా దూకుడుగానే వ్యవహరిస్తుండటంతో తెరాస ‘పని చేసే ప్రభుత్వమనే’ అభిప్రాయం ప్రజలకి కల్పించగలుగుతోంది. వచ్చే ఎన్నికల వరకు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే తెరాసకు తిరుగు ఉండకపోవచ్చును. కనుక ఆ పార్టీలో చేరుతున్నవారు ‘సేఫ్ జోన్’ లోకి చేరుతునట్లే భావించవచ్చును. కానీ ఇతర పార్టీల నుండి వచ్చి చేరుతున్న వారితో తెరాస పూర్తిగా నిండిపోయింది. బయట నుండి వచ్చిన వారికే పదవులు, అధికారం దక్కుతుండటంతో చిరకాలంగా పార్టీని నమ్ముకొన్నవారు చాలా అసంతృప్తితో ఉన్నారు. కనుక పాత, కొత్త నేతల మధ్య, అలాగే పార్టీలో కాంగ్రెస్, తెదేపా నేతల మధ్య అభిప్రాయభేదాలు, గొడవలు, పోటీ నానాటికీ పెరుగుతాయే తప్ప తగ్గే అవకాశం లేదు. ఈ సమస్యను తెరాస అధినేత పరిష్కరించుకోవలసి ఉంటుంది.