బెల్లంకొండకు బాలీవుడ్ లో ఎంతో కొంత మార్కెట్ ఉందన్నది నిజం. తన సినిమాలకు హిందీ నుంచి డబ్బింగ్ రైట్స్ రూపంలో మంచి ఎమౌంటే వచ్చేది. దాన్ని నమ్ముకొని నేరుగా హిందీలో ఓ సినిమా చేసేశాడు. అదే ఛత్రపతి. ఈ సినిమాని పెన్ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. ఛత్రపతిని బలంగా నమ్మిన పెన్ స్టూడియోస్, బెల్లంకొండతో మరో రెండు సినిమాలకు ఎగ్రిమెంట్ చేసుకొంది. అయితే… ఛత్రపతి డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
ఈ సినిమాని ప్యాకేజీ సిస్టమ్ లో చేసింది పెన్ స్టూడియోస్. రూ.60 కోట్లు తీసుకెళ్లి బెల్లంకొండ సురేష్ చేతిల్లో పెట్టింది. సినిమా రూ.40 కోట్లలో పూర్తయ్యిందని, మిగిలిన రూ.20 కోట్లు వెనక్కి ఇవ్వాలని పెన్ స్టూడియోస్ వాదనకు దిగింది. వడ్డీ లెక్కలు కూడా వేసుకొంటే మరో 5 కోట్లు. అలా.. మొత్తానికి బెల్లంకొండ పెన్ స్టూడియోస్కి రూ.25 కోట్లు బాకీ అన్నమాట. పైగా.. శ్రీనివాస్ ఆ సంస్థకు మరో రెండు సినిమాలు చేయాలి. ఆ సినిమాలు ఇప్పుడు ఎలాగూ చేయడు. కాబట్టి ఎగ్రిమెంట్ ప్రకారం బెల్లంకొండ శ్రీనివాస్ ఏ సినిమా చేసినా ఆ పారితోషికం నుంచి 30 నుంచి 40 శాతం పెన్ స్టూడియోస్కి చెల్లించాలన్నది ఒప్పందం. అలా రూ.25 కోట్లు తీర్చాలి. ఇప్పుడు బెల్లంకొండ చేతిలో 4 సినిమాలున్నాయి. ఈ 4 సినిమాలతో పెన్ స్టూడియోస్ బాకీ తీర్చేయాలని బెల్లంకొండ శ్రీనివాస్ కృత నిశ్చయంతో ఉన్నాడు.