రైతుబంధు పంపిణీకి ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నవంబర్ 24వ తేదీ నుంచే రైతుల ఖాతాల్లో రబీ పెట్టుబడి సాయం జమ చేసుకోవచ్చని చెప్పింది. అయితే 24వ తేదీన జమ చేయలేదు. కానీ 25, 26 ,27 తేదీల్లో బ్యాంకు సెలవులు ఉన్నాయి. అదే సమయంలో ఈసీ 29, 30 తేదీల్లో రైతుబంధు పంపిణీ చేయవద్దని స్పష్టం చేసింది. అంటే రైతు బంధు సాయం పంపిణీని 28న మాత్రమే పంపిణీ చేయాల్సి ఉంటుంది.
రైతుల ఖాతాల్లో మొత్తం జమ చేయాలంటే రూ. 7,700 కోట్లు కావాలి. అంత నగదు ప్రభుత్వం వద్ద ఉంటే.. మంగళవారం జమ చేసేస్తారు. కానీ గతంలోలా … ముందుగా ఎకరం ఉన్న వాళ్లకు పంపిణీ చేస్తామని.. వరసగా పంపిణీ చేస్తూ పోతామని ప్రభుత్వం తెలిపింది. అంటే.. ఒక్క రోజులో పంపిణీ అయ్యే అవకాశం లేదని పరోక్షంగా చెప్పినట్లయింది. అందరి రైతుల ఖాతాల్లో జమ చేయకపోతే సమస్య వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. జీతాల కోసం ఉన్నవి ఇతర సొమ్ములు జమ చేసేందుకే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇరవై ఎనిమిదో తేదీన ఎవరి అకౌంట్లలో డబ్బులు పడితే వారికి రైతు బంధు వచ్చినట్లు లేకపోతే.. మిగిలిన వారు ఎదురు చూడాల్సిదేనని భావిస్తున్నారు. రైతు బంధు అంశం మొదటి నుంచి రాజకీయ వివాదంగానే ఉంది. రైతు బంధు పథకానికి నిధులు ఇస్తామంటే కాంగ్రెస్ అడ్డుకుందని ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మొదట్లో తీవ్ర విమర్శలు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు జమ చేయకపోతే… కాంగ్రెస్ పార్టీ నుంచి మరిన్ని విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది.