తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కానీ టీడీపీ మద్దతు కోసం అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ .. టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తమకే దక్కుతాయని ఆ పార్టీ జెండాలను పట్టుకుని మరీ పలు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు టీడీపీ జెండాలతో ప్రచారం చేసుకుంటున్నారు. ఆ పార్టీ నేతలు తమ నియోజకవర్గాల్లో ఉంటే.. వారిని తమ ప్రచారంలో తిప్పుకుంటున్నారు.
ఈ ఎన్నికల్లో టీడీపీ సానుభూతిపరులు ఫలానా పార్టీకి లేదా కూటమికి మద్దతుగా ఓటు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చే అవకాశం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వారు ఏ పార్టీకి అయినా ఓటు వేసుకోవచ్చని.. మద్దతు ఇవ్వవొచ్చన్న సంకేతాలు మాత్రం పంపారు. ఇతర పార్టీలు తమకు టీడీపీ మద్దతు ఉందని ప్రకటించుకుంటున్నా.. ఆయా పార్టీల ర్యాలీల్లో పాల్గొంటున్నా వద్దని చెప్పడం లేదు. దీంతో ఆత్మప్రబోధానుసారం ఓట్లు వేయవచ్చని చెప్పినట్లయిందని అంటున్నారు.
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇప్పుడు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు లేరు. తదుపరి ఎవరికి చాన్సిస్తారన్నదానిపై టీడీపీలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నందున కొత్త అధ్యక్షుడి నియామకంపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికలు పూర్తయిన తర్వాత రాజకీయాల్ని బట్టి తదుపరి కార్యాచరణ ఖరారు చేసుకునే అవకాశం ఉంది.