టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం మరోసారి నినదించబోతోంది. చంద్రబాబును అరెస్టు చేసిన రోజున ఎక్కడ ఆపారో మళ్లీ అక్కడి నుంచే ప్రారంభిస్తున్నారు. కుప్పం నుంచి ప్రారంభమైన యువగళంపై తప్పుడు ప్రచారం చేసేందుకు.. పోలీసులతో ఆటంకాలు సృష్టించేందుకు చేయని ప్రయత్నం లేదు. కానీ ఇంతింతై అన్నట్లుగా జన ప్రభంజనంగా యువగళం మారింది. మైకులు లాక్కుంటే.. గొంతు నొప్పి పుట్టేలా మాట్లాడారు. స్టేజ్ వేయనీయకపోతే చిన్న స్టూల్ వాడారు. పోలీసులు దాన్ని కూడా వదిలి పెట్టలేదు. అదీ లాక్కున్నారు. అయినా లోకేష్ ఎక్కడా తగ్గలేదు. ఆయన పట్టుదల నిరంతరం పెరుగుతూనే వచ్చింది.
ఓ వైపు నారా లోకేష్ పాదయాత్ర, మరో వైపు చంద్రబాబు భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో ఎటు చూసినా టీడీపీనే కనిపిస్తోందని…తాము ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామన్న ఉద్దేశంతో రాత్రికి రాత్రి చంద్రబాబు అరెస్టుకు కుట్ర చేశారు. ఎఫ్ఐఆర్లో పేరు కూడా లేకుండానే అరెస్టు చేసి ఆ తర్వాత తాము చేయాలనుకున్నవన్నీ చేశారు. చంద్రబాబుపై చిన్న ఆధారం లేదని హైకోర్టు తేల్చేసింది. 53 రోజుల పాటు నిర్బంధించారు. వరుసగా కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఈ క్రమంలో లోకేష్ న్యాయపోరాటం కోసం ఎక్కువ సమయం వెచ్చించారు.
చంద్రబాబు పై పెట్టేవి తప్పుడు కేసులేనని జాతీయ స్థాయిలో మీడియా దృష్టికి తీసుకెళ్లారు. కోర్టుల్లోనూ దాదాపుగా నిరూపించారు. నిధుల దుర్వినియోగం జరిగిందని కానీ.. చంద్రబాబు లంచాలు తీసుకున్నారని కానీ నిరూపించలేకపోయారు. మిషన్ కంప్లీట్ అవడంతో నారా లోకేష్ పాదయాత్ర మళ్లీ ప్రారంభిస్తున్నారు.
అడ్డంకులను అధిగమించిన తరవాత చేస్తున్న పాదయాత్ర మరింతగా రీ సౌండ్ రానుంది. ప్రజల నుంచి స్పందన రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సాఫీగా సాగిపోయే యాత్రకు ఆటంకాలు కల్పిస్తే… నెలకు కొట్టిన బంతిలా యువగళం ఎగసిపడనుంది.