కొల్లాపూర్ లో బర్రెలక్క అనే శిరీష పోటీకి నామినేషన్ వేశారు. సోషల్ మీడియా ఆమెకు అండగా నిలబడింది. కానీ అలా నిలబడేవాళ్లే కాదు.. ఆమెను టార్గెట్ చేసే వాళ్లు కూడా పెరగడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆమె నిరుద్యోగ సమస్యను ఎత్తి చూపుతున్నారని .. అది ఓ రాజకీయ పార్టీకి సమస్యగా మారుతుందని ఆ పార్టీకి కూలి మీడియా వంటి చానళ్లు ముందుగా రంగంలోకి దిగాయి. బర్రెలక్క తండ్రి వద్దకు పోయి మైకు పెట్టాయి. ఆయన తన కుమార్తె వ్యక్తిగత జీవితం గురించి తప్పుగా మాట్లాడారు. దీంతో బర్రెలక్క ఇలాటిందంటూ స్టోరీలు అల్లేశారు.
నిజానికి బర్రెలక్క కుటుంబాన్ని ఆయన తండ్రి వదిలేశారు. ఆయన వీరి బాగోగుల్ని పట్టించుకోవడం లేదు. అది నిజం. కానీ పాత విషయాలను చూపించి ఆమె క్యారెక్టర్ ను కించపరిచేందుకు ప్రయత్నించారు. అంతటితో ఆగలేదు ఇతర మీడియా, యూట్యూబ్ చానళ్లు బర్రెలక్క కుటుంబంపై ఎగబడ్డాయి. ఆమె బాబాయ్ లు.. ఇతరుల్ని పట్టుకుని ఇంటర్యూలు చేయడం ప్రారంభించారు. ఒకరు మద్దతుగా.. మరొకరు వ్యతిరేకంగా మాట్లాడేవారిని పట్టుకుని కథలు కథలుగా ప్రసారాలు చేయడం ప్రారంభించారు.
మరో వైపు ఆమెకు స్వచ్చందంగా ప్రచారం చేసేందుకు చాలా మంది కొల్లాపూర్ వెళ్తున్నారు. పలువురు విరాళాలు కూడా పంపుతున్నారు. ఆమెకు మద్దతు గ్రౌండ్ లెవల్లో పెరుగుతోంది. అదే సమయంలో ఆమె వల్ల నష్టం అనుకుంటున్న రాజకీయం మాత్రం క్యారెక్టర్ పై దాడి చేస్తోంది. బర్రెలక్క గెలుస్తుందో లేదో కానీ.. ఆమె మాత్రం ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఏ బ్యాక్గ్రౌండ్ లేని యువతకు రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. అన్ని రకాల దాడుల్ని ఎదుర్కొంటున్నారు.