పోలింగ్ కు ముందు రైతుల అకౌంట్లలో డబ్బు జమ చేసేందుకు వచ్చిన గొప్ప అవకాశాన్ని ఆర్థిక మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలతో బీఆర్ఎస్ కోల్పోయింది. అనుమతిని రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 28వ తేదీన రైతుల అకౌంట్లలో డబ్బు జమ చేస్తామని బీఆర్ఎస్ ను ఆదరించాలని హరీష్ రావు ఇటీవల ఎన్నికల ప్రచార సభల్లో చెబుతున్నారు. సిద్దిపేటలోనూ అదే చెప్పారు. ఆయన ఆర్థిక మంత్రి కావడంతో ఈ వ్యాఖ్యలను ఈసీ సీరియస్ గా తీసుకుని అనుమతి రద్దు చేసింది.
అయితే డబ్బులు జమ చేయడానికి పర్మిషన్ ఇచ్చి.. ఆర్థిక మంత్రి డబ్బులు జమ చేస్తామని చెప్పడమే తప్పని ఈసీ అనుమతి రద్దు చేయడంపై రాజకీయవర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఖజానాలో డబ్బుల్లేవని.. ఉన్నవి ఉద్యోగుల జీత భత్యాల కోసం బిల్లులు పెట్టినవేనని.. వాటిని రైతు బంధు కోసం మళ్లించడం సాధ్యం కాదన్న భావన అధికారవర్గాల్లో వినిపించింది. వ్యవసాయ శాఖ ప్రకటన కూడా డబ్బులు జమ చేస్తామని ఎక్కడా చెప్పలేదు.
మీడురోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి.. 29, 30 వ తేదీల్లో ఈసీ జమ చేయవద్దని చెప్పిందని.. వ్యవసాయసాఖ చెప్పింది. అంటే 28వ తేదీ ఒక్క రోజు మాత్రమే డబ్బులు జమ చేయడానికి అవకాశం ఉంది. ఆ రోజున విడుదల చేస్తామని రైతుల ఖాతాల్లో నగదు పడి టింగ్ టింగ్ మని సౌండ్ వస్తుందని హరీష్ రావు చెప్పడం ప్రారంభించారు. చివరికి అదే కారణంగా రైతు బంధు అనుమతి ని రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.
అసలు రైతు బంధు అనే పథకానికి నిధులు గత ఏడాది డిసెంబర్ లో నిధులు ఇచ్చారు. అయినా ఈసీ అడగడమే ఆలస్యం.. పోలింగ్ కు ముందు అనుమతి ఇచ్చి విమర్శల పాలయింది. ఇప్పుడు కూడా విమర్శలు తగ్గే అవకాశం లేదు. కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేయడానికి ఇలా చేశారని ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది.