రచయితగా వక్కంతం వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కిక్, రేసుగుర్రం, టెంపర్ లాంటి సూపర్ హిట్ కథలిచ్చాడు. జనాల మీటర్ తనకు బాగా తెలుసు. ఓ కమర్షియల్ ప్యాకేజీని కొత్తగా ముస్తాబు చేసి ఇవ్వడంలో దిట్ట. అయితే దర్శకుడిగా మాత్రం ఫెయిల్ అయ్యాడు. తను మెగాఫోన్ పట్టి తీసిన ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తరవాత మళ్లీ మెగాఫోన్ పట్టడానికి ఇంత కాలం పట్టింది. ఇప్పుడు నితిన్‌తో ‘ఎక్ట్సా’ తీశాడు. ఈ డిసెంబరులోనే రిలీజ్.
వంశీకి ఇది దర్శకుడిగా యాసిడ్ టెస్ట్ అని చెప్పొచ్చు. రచయితగా తనకున్న పరిచయాలు, గుర్తింపు తొలి రెండు సినిమాల వరకూ ఉపయోగపడింది. ఇప్పుడు మరో అవకాశం రావాలంటే, దర్శకుడిగా తానేంటో నిరూపించుకోవాల్సిందే. తొలి సినిమా విషయంలో వంశీ చాలా తప్పులు చేశాడు. తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ని వదులుకొని ఓ సీరియస్ కథ చెప్పాడు. చెప్పాల్సిన కథని నిజాయతీగా చెప్పాడు కానీ, అది తన మార్క్ సినిమా కాదు. కానీ ఈసారి ఆ తప్పు చేయలేదు. ‘ఎక్ట్సా’ అనేది నూటికి నూరుపాళ్లూ తన శైలి సినిమా. ఓ కిక్లా, ఓ రేసుగుర్రంలా మంచి కమర్షియల్ ప్యాకేజీనే అనే విషయం టీజర్‌తో అర్థమైపోయింది. టైటిల్ కూడా చాలా క్యాచీగా ఉంది. పైగా నితిన్‌కి ఇది టేలర్ మేడ్ క్యారెక్టర్లా కనిపిస్తోంది. శ్రీలీల ఉండనే ఉంది. రాజశేఖర్, రావు రమేష్‌తో.. ప్యాడింగ్ బలంగా ఉంది. హారీశ్ జయరాజ్ సంగీతం తోడైంది. ఇలా అన్ని రకాలుగా ఈ సినిమాని జాగ్రత్తగా డిజైన్ చేసుకొన్నాడు వంశీ. ఎంటర్టైన్మెంట్ పండితే.. ఇక బండి చూస్కోవాల్సిన పనిలేదు. వంశీ నమ్మకం కూడా ఇదే. ఈ సినిమా హిట్టయితే.. ఇక దర్శకుడిగానే వంశీ స్థిరపడే అవకాశం ఉంది. ఎందుకంటే ‘టెంపర్’ సమయంలోనే ఎన్టీఆర్ వంశీకి మాటిచ్చాడు. నీతో సినిమా చేస్తా అని. ఆ ప్రాజెక్ట్ కూడా ఆన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.