తెలంగాణలో ఈసీ అనుమతి ఇచ్చిన రైతు బంధు అనుమతిని రెండు రోజుల్లోనే ఈసీ అనుమతి ఉపసంహరించుకోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది. కారణం మీరంటే మీరని కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. హరీష్ రావు కారణంగానే తాము రైతు బంధు అనుమతిని ఉపసంహరించుకుంటున్నామని ఈసీ తన ఆదేశాల్లో స్పష్టంగా తెలిపింది. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం మూకుమ్మడిగా కాంగ్రెస్ ఆపేయించిందని ప్రచారం ప్రారంభించారు. కనీసం ఈసీ మీద కానీ…బీజేపీ మీద కానీ ఎలాంటి విమర్శలు చేయడంలేదు.
కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు వల్లనే ఈసీ రైతుబంధుకు ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రైతు నోటి దగ్గర బుక్కను కాంగ్రెస్ నతలు లాగేసుకున్నారని కేసీఆర్ ఆరోపించారు. హరీష్ రావు, కవిత కూడా ఇవే ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈసీకి రాసినట్లుగా చెబుతున్న ఓ లేఖను బీఆర్ఎస్ సోషల్ మీడియా వర్గాలు హైలెట్ చేశాయి. కానీ అది ఫేక్ లెటర్ అని కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నరని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మరో వైపు ఇదే అంశంపై ఈసీ కి విజ్ఞాపన ఇచ్చిన కేకే మాత్రం.. కాంగ్రెస్ కారణం కాదని మీడియాతో చెప్పడంతో బీఆర్ఎస్ చిక్కుల్లో పడినట్లయింది.
హరీష్ రావు తప్పు మాట్లాడి ఉంటే వివరణ తీసుకోవాలి కానీ అనుమతి రద్దు చేయడం కరెక్ట్ కాదన్నారు. రైతు బంధు నిధులకు అలా ఈసీ అనుమతి ఇవ్వడం.. వెంటనే ఉపసంహరించుకోవడంతో రైతులకు రైతు బంధు నిధులు జమ కావని తేలిపోయింది. తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో.. ఎప్పుడు ఇస్తుందో అని అన్నదాతలు కంగారు పడుతున్నారు. కానీ దీని చుట్టూ పూర్తి స్థాయి రాజకీయం అయితే జరుగుతోంది.