చంద్రబాబు హయాంలో మద్యం ప్రివిలేజ్ ఫీజును మాఫీ చేసి కొంత మందికి లబ్ది చేకూర్చారని సీఐడీ అధికారులు కేసులు పెట్టారు. అందులో చంద్రబాబు, కొల్లు రవీంద్రలతో పాటు శ్రీరామశ్రీనరేష్ అనే ఐఏఎస్ అధికారిపై కేసులు పెట్టారు. నిజానికి ఈ ప్రివిలేజ్ ఫీజు రద్దు ప్రతిపాదనలు పెట్టింది అప్పట్లో ఎక్సైజ్ శాఖను చూస్తున్న కల్లం అజేయరెడ్డి. ఆ తర్వాత ముఖేష్ కుమార్ మీనా అమలు చేశారు. వీరిద్దరూ కీలకం. కానీ వీరి పేర్లు రానివ్వలేదు. అసలు లక్ష్యం చంద్రబాబు కాదని… ముఖేష్ కుమార్ మీనా అని అధికారవర్గాలు కోడై కూస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయన రాష్ట్ర ఎన్నికల అధికారి, ఆయన చేతుల మీదుగానే రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.
అసలు ప్రివిలేజ్ ఫీజు రద్దు విషయంలో ఏం తప్పు జరిగిందో సీఐడీ చెప్పడం లేదు. కానీ కేసులు, విచారణల్లో ఇరికించడమే పెద్ద శిక్ష అని క్రిమినల్ బ్రెయిన్ పాలకులకు తెలుసు. మద్యం కేసు పెట్టడం ద్వారా… ముఖేష్ కుమార్ మీనా పేరును తెరపైకి తెచ్చారు. తాము చెప్పినట్లుగా చేయకపోతే… మద్యం కేసులో చేరుస్తామని … చేస్తే.. కల్లాం అజేయరెడ్డిలాగా హ్యాపీగా ఉండవచ్చని సంకేతాలు పంపారు. సీనియర్ ఐఏఎస్ అఫీసర్ ని ప్రభుత్వమే ఇలా బెదిరిస్తూండటంతో అధికారవర్గాల్లో కొత్త సంచలనంగా మారింది. ఎలాంటి ఆధారాలు లేకపోయినా ప్రాథమికంగా అరెస్టు చేసి జైళ్లలో ఉంచగలుగుతున్న వ్యవస్థల పతనంతో సీనియర్ అధికారులు కూడా ఆందోళనకు గురవుతున్నారు.
మద్యం దుకాణాలకు ప్రివిలేజ్ ఫీజు రద్దు పూర్తిగా విధానపరమైన నిర్ణయం. ఏమైనా క్విడ్ ప్రో కో జరిగితే నిరూపించాలి. కానీ ఒక్క రూపాయి కూడా ఎక్కడా మనీ ట్రయల్ చూపించరు. ఖజానాకు నష్టం జరిగిందని వాదిస్తారు. కానీ అలా రద్దు చేయడం వల్ల ఆదాయం పెరిగిందని కాగ్ కూడా నివేదిక ఇచ్చింది. అయినా న్యాయవ్యవస్థకు తప్పుడు సమాచారం.. అరకొర సమాచారం ఇచ్చి కథ నడిపిస్తుననారు. ఇప్పుడు ముఖేష్ కుమార్ మీనాపైనా ఇదే ప్రయోగం చేస్తున్నారని జోరుగా చర్చ సాగుతోంది.
ఏపీలో ఇప్పుడు ఓటర్ల జాబితా తప్పుల తడక అయిపోయింది. ఒక్కో నియోజకవర్గంలో పది వేలకుపైగా ఓట్లు గ్యాంబ్లింగ్ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లు తొలగించడం.. దొంగ ఓట్లు చేర్చడం వంటి పనులు చేస్తున్నారు. ప్రతిపక్షాల నుంచి ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా అంతంతమాత్రం పరిశీలన ఉంటోంది. కోర్టులకు వెళ్తే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. అదే సమమంలో ఓటర్ జాబితా సవరణలో వాలంటీర్ల ప్రమేయం వద్దని చెప్పినప్పటికీ మొత్తం వారి చేతుల మీదుగానే జరుగుతోంది. అయినా సీఈవో ఏమీ చేయలేకపోతున్నారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం ఢిల్లీ స్థాయికి చేరిందని చెబుతున్నారు. మద్యం కేసు పేరుతో ఈసీని బెదిరిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో… అక్కడ ఈ అంశంపై సమాలోచనలు జరుగుతున్నాయి. త్వరలో ఈసీ ఓ కఠిన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.