ఓటర్ల నమ్మకం పొందడానికి తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు చేయగలిగినదంతా చేస్తున్నారు. ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు స్టాంప్ పేపర్ మీద బాండ్లు రాశారు. ఈ మేరకు సోమవారం అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహంచారు. ఆలయాల్లో ప్రమాణం చేసి బాండ్లపై సంతకాలు చేశారు. ఈ బాండ్లు చెల్లుతాయా లేదా అన్న సంగతి పక్కన పెడితే.. ప్రజల్లో నమ్మకం పెంచుకోవడానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ప్రజలకు మేలు చేసేలా ఉన్నాయి కానీ.. వాటిని అమలు చేస్తారా అన్న డౌట్స్ సహజంగానే వస్తాయి. కర్ణాటకలో అమలు చేయడం లేదని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు ఏదో ఓ చర్య చేపట్టాలని భావించి చివరికి బాండ్లు రాసివ్వాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకు అమలు చేశారు.
సానుకూల పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ… బీఆర్ఎస్ ప్రచారాలను గట్టిగా తిప్పికొడితే చాలని అనుకుంటున్నారు. వచ్చే రెండు, మూడు రోజులు ఇంకా ఘోరమైన ప్రచారం ఉంటుందని దానికి తగ్గట్లుగా ఎదురుదాడి చేసేందుకు రెడీ కావాలని కాంగ్రెస్ అభ్యర్థులు భావిస్తున్నారు. కాంగ్రెస్ వార్ రూమ్ కూడా వీటిపై దృష్టి పెట్టింది.