చంద్రబాబు జనాల్లోకి వస్తే తమ పరిస్థితి ఏమి అయిపోతుందోనని కంగారు పడిపోతున్న జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ సుప్రీంకోర్టులోనూ దాని కోసమే ప్రయత్నించారు. చంద్రబాబు రాజకీయ ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనకుండా షరతులు విధించాలని కోరారు. బెయిల్ రద్దు చేయకపోయినా పర్వాలేదు ఆ షరతు పెట్టాలన్నట్లుగా వాదనలు వినిపించారు. అయితే సుప్రీంకోర్టు ఆ ఒక్క షరతు తప్ప.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సమయంలో ఉన్న షరతులు వర్తిస్తాయని స్పష్టం చేసి తీర్పువాయిదా వేసింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే.. స్కిల్ కేసుపై ఇక ప్రభుత్వం కూడా బహిరంగంగా ప్రకటనలు చేయవద్దని స్పష్టం చేసింది.
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీసీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ కుమార్ మిశ్రా ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చిన వెంటనే ఈ అంశపై ఇతర బెంచ్ ముందు ఉన్న క్వాష్ పిటిషన్ పై తీర్పు రావాల్సి ఉన్నందున పిటిషన్ పై విచారణ వాయిదా వేస్తామని ధర్మాసనం తెలిపింది. ఈ సమయంలో సీఐడీ తరపు లాయర్లు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ అంశంపై చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తామన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఎనిమిదో తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అదే సమయంలో చంద్రబాబు బెయిల్ షరతుల అంశాన్ని సీఐడీ తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. స్కిల్ కేసుపై బహిరంగంగా మాట్లాడవద్దని సుప్రీంకోర్టు తెలిపింది.
అదే సమయంలో ప్రభుత్వం బహిరంగ ప్రకటనలు చేస్తోందని చంద్రబాబు తరపు లాయర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇరు వర్గాలు కేసుపై మాట్లాడవద్దన్న సుప్రీంకోర్టు నవంబర్ మూడో తేదీన హైకోర్టు పెట్టిన బెయిల్ షరతుల్లో రాజకీయ ర్యాలీలు, సభల్లో పాల్గొనకూడదన్న అంశం మినహా మిగిలిన షరతులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఎనిమిదో తేదీ లోపు చంద్రబాబును కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను పదకొండో తేదీకి వాయిదా వేసింది.