ఏపీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ అంశంలో ఉపాధ్యాయుల్ని దూరం పెట్టాలని అనుకుంటోంది. అందు కోసం విద్యా హక్కు చట్టంలోని నిబంధనలకు వైసీపీ ప్రభుత్వం సవరణలు చేసింది. టీచర్లకు బోధన, విద్యా సంబంధిత అంశాలు మినహా ఎలాంటి బోధనేతర పనులు అప్పగించకూడదంటూ అప్పట్లో జీవో జారీచేసింది. ఈ జీవో లక్ష్యం ఉపాధ్యాయుల్ని ఎన్నికల విధులకు దూరంగా ఉంచడమే.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఉపాధ్యాయులే ఎక్కువగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సారి ఎన్నికల సన్నాహాల్లో ఉపాధ్యాయుల వివరాలు పంపాలని ఈసీ అడిగింది. 2024 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఉపాధ్యాయులను పీవోలుగా, ఏపీవోలుగా, ఇతర పోలింగ్ అధికారులుగా విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించారు. టీచర్లకు బదులుగా సచివాలయ సిబ్బందిని ఎన్నికలకు వినియోగించుకోవాలని ఈసీకి సూచించే అవకాశం ఉంది.
మరో వైపు టీచర్లను విధుల్లోకి తీసుకోకుండా కొత్త ఎత్తులు వేస్తోంది. టీచర్లకు ఏకపక్షంగా వందల కొద్దీ చార్జి మెమోలు జారీ చేస్తోంది. వారిపై చర్యలు తీసుకుని.. వారు ఎన్నికల విధులకు అనర్హులని చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. ఇది వివాదాస్పదం అవుతోంది. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని విపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. మరో వైపు ఎన్నికలను మ్యానిప్యులేట్ చేయడానికే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకు వచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
టీచర్లు ఎన్నికల విధుల్లో వద్దని ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇది ఈసీతో ఘర్షణకు దారి తీసినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.