జగన్ రెడ్డి సీఎం సీట్లో కూర్చోగానే… ఏపీలో జరిగిన అతి పెద్ద అరిష్టం విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం. ఆ ఘటనపై చాలా అనుమానాలున్నా… విచారణలో ఏదీ బయటకు రాలేదు. కానీ జగన్ రెడ్డి మృతుల కుటుంబాలకు రూ.కోటి, అలాగే ఇతరులకు కూడాపెద్ద మొత్తంలో పరిహారం ప్రకటించారు. ఫ్యాక్టరీ ఉన్న ఊరికి చాలా హామీలు ఇచ్చారు. ఇదంతా తాము చేస్తున్నట్లుగా చెప్పుకున్నారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత చూస్తే… ప్రజలకు చెల్లించాల్సిన పరిహారం కిందనే ఆ సంస్థ ఏకంగా రూ. 143 కోట్లు ప్రభుత్వానికి చెల్లించింది. కానీ బాధితులకు ప్రభుత్వం చెల్లించింది కనీసం ముఫ్పై కోట్లు కూడా ఉండదని చెబుతున్నారు.
ఎల్జీ పాలిమర్స్ బాధితులు ఇప్పటికీ పెద్ద ఎత్తున రోగాల బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వారి కోసం ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కడతామని చెప్పారు. కానీ ఇంత వరకూ ఆ పని చేయలేదు. ఆరోగ్యాలు దెబ్బతిని అనేక మంది మంచానపడ్డారు. వారికి అందుతున్న సాయమే లేదు. అప్పట్లో ఆర్భాటంగా చేసిన ప్రకటనలు.. సాయం తప్పితే తర్వాత పట్టించుకోలేదు. కనీసం కంపెనీ ఇచ్చిన రూ. 143 కోట్ల పరిహారాన్ని పంపిణీ చేయలేదని తెలుస్తోంది. జగన్ రెడ్డి సీఎం హోదాలో ప్రకటించింది ప్రభుత్వం ఇచ్చిన సాయం. కంపెనీ సాయం కాదు. మరి కంపెనీ ఇచ్చిన సాయాన్ని ఎందుకు పంపిణీ చేయలేదు.
ఎల్జీ పాలిమర్స్ ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటేనే చాలా మందికి వణుకువస్తుంది. గ్యాస్ లీక్ కారణంగా రోడ్ల మీద వారు ఎక్కడిక్కడ పడిపోయారు. పిట్టల్లా రాలిపోయారు. ఆ కంపెనీని రక్షించడానికే జగన్ రెడ్డి సర్కార్ అన్నిప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఆ కంపెనీని అక్కడ్నుంచి శ్రీసిటీకి తరలిస్తామని కోర్టుకు చెప్పుకున్నారు. ప్రభుత్వం అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపింది.