పది నెలల కిందట జరిగిన చిన్న తోపులాటలో ఓ పోలీసులకు గాయం అంయిందని.. అదే పది నెలల తర్వాత గుర్తించి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి.. కిడ్నాప్ తరహాలో బీటెక్ రవిని కడప పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను హత్య చేసేందుకే ఈ పని చేశారని.. పోలీసులే తీసుకె్ళ్లినట్లుగా తెలియడంతో అరెస్టు చూపించారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో బీటెక్ రవికి తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభించడానికి రెండు రోజుల ముందు జనవరి 25న కడపలోని దేవుని కడప ఆలయం, పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా లోకేశ్‌కు స్వాగతం పలకడానికి పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీటెక్ రవి కడప విమానాశ్రయం ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. అప్పట్లో కేసు నమోదు చేసి ఊరుకున్నారు. కానీ హఠాత్తుగా అరెస్టు చేశారు. ఓ నోటీసు లేదు.. పైగా పది నెలల పాటు ఆయన కనిపించడం లేదని ఎస్పీ చెప్పారు.
ఆయన పది నెలలుగా పులివెందులలోనే ఉన్నారు. ఎస్పీని కూడా కలిశారు. అయినా అడ్డగోలుగా అబద్దం చెప్పేశారు ఎస్పీ. చంపడానికే బీటెక్ రవిని తీసుకెళ్లారని సీఎం రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. బీటెక్ రవిని అరెస్ట్ చేసిన తర్వాత మూడు గంటల పాటు ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలన్నారు. వల్లూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడానికి పావుగంట పడుతుందని మిగతా సమయం ఎక్కడ ఉంచారో చెప్పాలన్నారు. అయితే పోలీసులు సీఎం రమేష్ కు లీగల్ నోటీసుల ఇస్తామని బెదిరించారు. ఇవ్వాలని సీఎం రమేష్ సవాల్ చేశారు. కడప పోలీసుల గురించి కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చానని ఆయన ప్రకటించారు.