ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. తమ పాలకుల్ని ఎన్నుకోవడానికి వేసే ఓటు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే తర్వాత మన జీవితాలు, మన పిల్లల భవిష్యత్ కూడా తారు మారు అవుతాయి. మనది మెజార్టీ ప్రజాస్వామ్యం. ఎక్కవ మంది ఎవర్ని కోరుకుంటారో వారే పాలకులు అవుతారు. అందువల్ల మీరు కోరుకునే పాలకులే గెలుస్తారని నా ఒక్క ఓటుతో పోయేదముందని అనుకుంటే… అంత కంటే మీకు మీరు ద్రోహం చేసుకోవడం ఉండదు. ఎందుకంటే ఒక్కో ఓటు కలిస్తేనే మీరు కోరుకునే పాలకుడు వస్తాడు. అందరూ ఆయనే గెలుస్తారు కదా అని అని ఇంట్లో కూర్చుంటే… జనాభిమానం లేని వారు గెలుస్తారు. దాని వల్ల జరిగే పరిణామాలను ఊహించడం కష్టం కాదు.
అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోయినా ఓటు వేయడానికి .. నోటా అనే ఆప్షన్ ఉంది. అది నొక్కాలని కాదు. ఆ ఆప్షన్ నొక్కినా నిరుపయోగమే. ఉన్న అభ్యర్థుల్లో వీలైనంత మంచి వారిని… ఎంపిక చేసుకుని ఎన్నుకుంటే ఉపయోగం. రెండు, మూడు దశాబ్దాల కిందటిలా ఇప్పుడు రాజకీయాలు లేవు. ప్రజల జీవితాల్ని నేరుగా ప్రభావితం చేస్తున్నారు. ప్రజల్ని బిచ్చగాళ్లుగా మార్చడానికో.. వారిని నిరుపేదలుగా మార్చి ప్రభుత్వంపై ఆధారపడి బతికేవాళ్లలాగా చేసి .. తమకు ఓటు బ్యాంకులుగా చేసుకోవడానికో రాజకీయాలు చేస్తున్నాయి. అంటే ప్రజల్ని దిగజారుస్తున్నారు. చదువుకున్న వారు.. సమాజం పట్ల అవగాహన ఉన్న వారు క్యూ లైన్లో నిలబడి ఓటు వేయకపోవడం వల్లనే ఇలాంటి పాలకులు వస్తున్నారు. దీన్ని అధిగమించాలంటే ఓటు వేయాలి.
తెలంగాణ పల్లెల్లో ఓటు చైతన్యం వెల్లి విరుస్తుంది. కనీసం 90 శాతం పోలింగ్ నమోదవుతుంది. కానీ పట్టణాల్లో మాత్రం ఎక్కడా అరవై శాతం కూడా నమోదు కాదు. హైదరాబాద్ లో అయితే మరీ ఘోరంగా యాభై శాతం వరకే ఉంటుంది. ఎన్ని విచిత్రమైన కారణఆలు చెప్పుకున్నా ఇంత తక్కువ శాతం ఓటింగ్ ప్రజాస్వామ్యానికి అవమానమే. అందుకే అందరూ రండి.. ఓటేద్దాం.. ఓటెత్తుదాం.. మన పాలకుల్ని ఎంచుకుందాం.. మనమే గెలుద్దాం !