Dhootha web series review
దర్శకుడు విక్రమ్ కె.కుమార్ అభిరుచి గురించో, ప్రతిభ గురించో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తను స్క్రీన్ ప్లే మాస్టర్! ’13 బీ’ హారర్ జోనర్లో తను చేసిన ఓ బ్రిలియెంట్ వర్క్.’మనం’లో తన స్క్రీన్ ప్లే బ్రిలియన్స్ కనిపిస్తుంది. తనకు కూడా కొన్ని ఫ్లాపులు ఉండొచ్చు. కానీ.. అలాంటి ఫ్లాప్ సినిమాలోనూ ఏదో ఓ చోట విక్రమ్ మెరుస్తాడు. తనో వెబ్ సిరీస్ చేస్తున్నాడంటే, అందులో నాగచైతన్య హీరో అంటే తప్పకుండా అటువైపు ఫోకస్ ఉంటుంది. అలా..’దూత’ అందరి దృష్టినీ ఆకర్షించింది. విక్రమ్ కె.కుమార్ లాంటి స్టోరీ టెల్లర్లకు వెబ్ సిరీస్ కంటే మంచి అనువైన చోటు ఉండదు. మరి ఈ వేదికపై.. విక్రమ్ తన మార్క్ ఎంత వరకూ చూపించుకోగలిగాడు? ఈ ‘దూత’ వెబ్ సిరీస్ లో కొత్తగా ఏముంది?
సాగర్ వర్మ అవధూరి (నాగచైతన్య) సమాచార్ పత్రికకు ఎడిటర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తాడు. అదే రోజు రాత్రి వర్షంలో తన కుటుంబంతో కలిసి కార్లో ఇంటికి వెళ్తూ వెళ్తూ దారిలో ఓ దాబా దగ్గర ఆగుతాడు. అక్కడో ఓ చిన్న వార్తా పత్రిక ముక్క దొరుకుతుంది. అందులో మరి కొద్ది సేపట్లో సాగర్ వర్మ కారు ప్రమాదానికి గురైనట్టు, ఆ ప్రమాదంలో సాగర్ వర్మ కుక్క చనిపోయినట్టు రాసిన వార్త కనిపిస్తుంది. అంటే భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఆ వార్త సూచిస్తోందన్నమాట. ఆ పేపర్లో జరిగనట్టే.. రోడ్డు ప్రమాదంలో పెంపుడు కుక్క చనిపోతోంది. అప్పటి నుంచీ.. సాగర్ వర్మ భవిష్యత్తు మొత్తం తనకు చిన్న చిన్న పేపర్ కటింగ్స్ రూపంలో ముందే తెలిసిపోతుంటుంది. సాగర్ వర్మ మెల్లమెల్లగా అగాధంలో కూరుకుపోతుంటాడు. తన కుటుంబం కష్టాల్లో పడుతుంది. సాగర్ వర్మ జాతకాన్ని ముందే పత్రికల్లో రాస్తున్న ఆ ‘దూత’ ఎవరు? కేవలం సాగర్ వర్మకే ఇలా జరుగుతోందా? ఎవరి జీవితంలో అయినా ఇలాంటి ఘటనలు జరిగాయా? సాగర్ వర్మ కథకీ, 1962లో సత్యమూర్తి (పశుపతి) అనే జర్నలిస్టుకీ ఉన్న సంబంధం ఏమిటి? ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన డీసీపీ క్రాంతికి ఎలాంటి నిజాలు తెలిశాయి? అనేదే ‘దూత’ కథ.
వెబ్ సిరీస్ ఫార్ములాని తెలుగు వాళ్లు సరిగా అర్థం చేసుకోలేదన్నది ఓ గట్టి విమర్శ. అందుకే తెలుగులో ఇన్ని వెబ్ సిరీస్ లు వస్తున్నా, అవి సినిమాలకు ఎక్స్టెన్షన్ వెర్షన్లుగానే మిగిలిపోన్నాయి తప్ప, వెబ్ సిరీస్ చూశామన్న సంతృప్తిని మాత్రం కల్పించలేకపోతున్నాయి. ఈమధ్య మాత్రం కొన్ని వెబ్ సిరీస్‌లు చూస్తే తెలుగులోనూ ధీటైన కంటెంట్ వస్తోందన్న నమ్మకం కలుగుతోంది. కొద్ది రోజుల క్రితం అమేజాన్ లో వచ్చిన ‘శ్రీమతి కుమారి’ ఓ మంచి ఉదాహరణ. ‘దూత’ కూడా అలాంటి నమ్మకాన్ని కలిగించింది.
‘దూత’ కథని ఒక్క ముక్కలో చెప్పలేం. అందులో చాలా లేయర్లు, ఇంకెన్నో పాత్రలూ ఉన్నాయి. అయితే చివరికి ఆ లేయర్లనీ, ఆ పాత్రల్నీ ఒకే తాటికిపై తీసుకురావడంలో విక్రమ్ కె.కుమార్ స్క్రీన్ ప్లే మ్యాజిక్ కనిపిస్తుంది. విక్రమ్ తాను రాసుకొన్న ఏ పాత్రనీ వృధాగా వదల్లేదు. చక్రాల కుర్చీలో చూపించిన చిన్న పాపని కూడా చివర్లో తీసుకొచ్చి అన్ని డాట్స్ నీ కలపడంలో… విక్రమ్ నేర్పు కనిపిస్తుంది. చిన్న చిన్న డిటైలింగ్స్ కూడా బాగా ఎలివేట్ చేసుకోగలిగాడు. ఇంత అవకాశం కేవలం వెబ్ సిరీస్‌ల్లోనే కనిపిస్తుంది. విక్రమ్ రాసుకొన్న డిటైటింగ్స్ చూస్తే ముచ్చటేస్తుంది. హీరోకి.. ఫజిల్ గేమ్ సాల్వ్ చేయడం అంటే ఇష్టం అని ఒకే ఒక్క డైలాగ్ తో చూపించాడు. ఆ ఫజిల్ గేమ్ లో ఉన్న ఆసక్తి వల్లే.. దాబాలో పేపర్ కటింగ్ వైపు హీరో దృష్టి పడుతుంది. అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది. డ్రైవర్ కోటి బంగారు పన్ను, సాక్స్ కలర్ మారడం, కుక్కకు ఇంకా పేరు పెట్టకపోవడం.. ఇలా చిన్న చిన్న డిటైల్స్ వల్ల కథనంలో కొత్త ఆసక్తులు రేగాయి. మలుపులకూ, షాకింగ్ ఎలిమెంట్స్ కూ ఇలాంటి డీటైలింగ్స్ చాలా ఉపయోగపడ్డాయి.
వెబ్ సిరీస్ అంటే కథనాన్ని నిదానంగా నడపొచ్చులే అనే ఓ ధీమా వస్తుంది. దాని వల్ల బోరింగ్ సన్నివేశాలు పేర్చుకొంటూ వెళ్తారు. కానీ విక్రమ్ అలా చేయలేదు. సీన్ నెంబర్ వన్ నుంచో.. సీరీస్ పరుగులు పెడుతుంటుంది. ఒక్కో ఎపిసోడ్ ని ఆపి, మరో కొత్త ఎపిసోడ్ ని మొదలు పెట్టడంలోనూ విక్రమ్ తన పనితనం చూపించాడు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్ల సిరీస్ ఇది. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాలలకు పైమాటే. ఒకటీ రెండు చోట్ల తప్పిస్తే.. ఎక్కడా బోరింగ్ ఫీల్ లేకుండా చేశాడు. డ్రైవర్ కోటీ ఇన్వెస్టిగేషన్ ఒక్కటే మరీ నిదానంగా సాగుతుంటుంది. అయితే ఆ ఎపిసోడ్ ని ముగించిన తీరు మాత్రం బాగుంటుంది. చివర్లో డీసీపీ క్రాంతి ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం క్లోజ్ అయిన కేసుని నిమిషాల వ్యవధిలో, నిలబడే చక్కబెట్టేస్తుంటుంది. అక్కడ మాత్రం దర్శకుడు టూ మచ్ లిబర్టీ తీసుకొన్నాడనిపిస్తుంది. ఈ కథలన్నీ ఒకే చోటకు చేర్చాలన్న ప్రయత్నంలో.. జరిగిన చిన్న పొరపాటు ఇది.
ఇందులో దెయ్యం లేదు. కానీ ఓ అదృశ్య శక్తి మాత్రం భయపెడుతుంటుంది. సాధారణంగా ఇలాంటి కథల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో భయాన్ని ఓ ఎలివెంట్ గా తీసుకొచ్చి వాడతారు. కానీ దర్శకుడు అలాంటి ప్రయత్నం చేయలేదు. కేవలం ఓ పేపర్ క్లిప్పింగ్ తో భయపెట్టారు. పేపర్ కటింగ్ ఎప్పుడు ఎగురుకుంటూ వచ్చినా, ఏదో ఓ ఉపద్రవం జరగబోతోందన్న టెన్షన్ మొదలవుతుంది. మీడియా – రాజకీయాలు… ఇవి రెండూ ఒకరి కోసం ఒకరిగా ఎంతగా పెనవేసుకుపోయాయి, వాటి మధ్య జర్నలిజం విలువలు ఎలా నలిగిపోతున్నాయో చెప్పే ప్రయత్నం ‘దూత’. కాకపోతే… లెక్చర్లు దంచి కొట్టలేదు. ఈ పాయింట్ చుట్టూ రాసుకొన్న థ్రిల్లర్ కాబట్టి, ప్రేక్షకులకు థ్రిల్లిచ్చే ఎపిసోడ్ల వైపే ఎక్కువ దృష్టి నిలిపారు. క్లైమాక్స్ కూడా అర్థవంతంగా ఉంది.
నాగచైతన్య పాత్రలో రెండు లేయర్లు ఉన్నాయి. పాజిటీవ్ నుంచి నెగిటీవ్ షేడ్స్‌లోకి ఈ పాత్ర మారుతుంటుంది. ఆ మార్పు కూడా చాలా సహజంగా కనిపిస్తుంది. ఈనాటి పాత్రికేయ రంగంలో ఉన్న కరెప్షన్కి ఓ అచ్చమైన ప్రతినిధిలా నాగచైతన్య కనిపిస్తాడు. చూడ్డానికి చాలా అందంగా కనిపించాడు. ఇన్నేళ్ల అనుభవం ద్వారా వచ్చిన పరిణితి.. తన నటనలో కనిపించింది. దాదాపుగా ప్రతీ సీన్లోనూ చైతూ కనిపిస్తూనే ఉంటాడు. భయం, బాధ, అహంకారం ఇవన్నీ తన గొంతులోనూ పలికాయి. డీసీపీ క్రాంతి పాత్రలో పార్వతీ తిరువోతు హుందాగా కనిపించింది. ప్రియ భవానీ శంకర్ పాత్రలోనూ కొన్ని లేయర్స్ ఉన్నాయి. పశుపతిది చిన్నపాత్రే. కానీ కథకు కీలకం. తరుణ్ భాస్కర్, గౌతమ్ చిన్న చిన్నపాత్రల్లో మెరిశారు.
టెక్నికల్ గా ‘దూత’ ఉన్నత స్థాయిలో ఉంది. వెబ్ సిరీస్ అంతా వర్షంతో నిండిపోయింది. మనం కూడా వర్షంలో ఉన్నామన్న ఓ ఫీలింగ్ ని ఈ వెబ్ సిరీస్ తీసుకొచ్చింది. కెమెరా, బ్యాగ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ డిజైనింగ్ సినిమా `క్వాలిటీ`కి ఏమాత్రం తగ్గలేదు. ఒకట్రెండు ‘బీప్’ డైలాగులు మినహాయిస్తే….ఫ్యామిలీ అంతా చూసేలానే ఈ వెబ్ సిరీస్ డిజైన్ చేశారు. దర్శకుడిగా విక్రమ్ మార్క్ స్పష్టంగా కనిపించిన థ్రిల్లర్ ఇది. ఓ సూపర్ నేచురల్ ఎలిమెంట్ ని, ఓ థ్రిల్లర్‌కి అన్వయించి, ఎక్కడా లాజిక్కుల గురించి ఆలోచించకుండా, దెయ్యాన్నికూడా చూపించకుండా ఓ చిన్న మ్యాజిక్ చేశాడు విక్రమ్. తెలుగులో వచ్చిన మరో మంచి వెబ్ సిరీస్ ఇది. థ్రిల్లర్ ప్రియులకు మరో మంచి ఆప్షన్.