తెలుగు360 రేటింగ్ : 2/5
క్రైమ్ థ్రిల్లర్ బడ్జెట్ ఫ్రెండ్లీ జానర్. అందుకే అప్ కమింగ్ ఫిల్మ్ మేకర్స్ ఈ జానర్ పై ఆసక్తి చూపిస్తారు. మంచి కథ, కథనం, కొన్ని మలుపులు కుదిరితే చిన్న సినిమాలు కూడా మంచి ఫలితాలు ఇచ్చిన సంధర్భాలు వున్నాయి. ఇప్పుడు అదే జానర్ లో వచ్చింది ‘అథర్వ’. నేరపరిశోధన, క్లూస్ టీం నేపధ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారు. ఎలాంటి క్లూస్ లేని ఓ కేసుని ఎలా పరిష్కరించారనే పాయింట్ ని ట్రైలర్ గా కట్ చేసి కాస్త ఆసక్తిని పెంచారు. మరా ఆసక్తి సినిమాలో కనిపించిందా? క్లూస్ టీం నేపధ్యం ఎంత కొత్తగా సాగింది?
దేవ్ అథర్వ కర్ణ.. అలియాస్ (కార్తీక్ రాజు)ది హన్మకొండ. పోలీస్ అవ్వాలనేది అతని కల. అయితే ఆస్తమా కారణంగా ఫిజికల్ టెస్ట్ లో తప్పుతుంటాడు. ఈ క్రమంలో తనకి క్లూస్ టీం విభాగం గురించి తెలుస్తుంది. ఆ ఉద్యోగానికి దరకాస్తు చేసి పరీక్షలో ఉత్తీర్ణత పొంది హైదరాబాద్ క్లూస్ టీంలో బయోమెట్రిక్ ఎనలిస్ట్ గా చేరుతాడు. తన ప్రతిభని చూపించి పోలీసు శాఖలో పదోన్నతి పొందాలనేది అతని ఆశయం. ఓ దొంగతనం కేసులో పోలీసులకు సాయం చేసి అందరి ద్రుష్టిని ఆకర్షిస్తాడు. ఈ సమయంలోనే ప్రముఖ హీరోయిన్ జోష్ని (ఐరా) కేసు సంచలనం సృష్టిస్తుంది. జోష్ని, ఆమె లవర్ శివ.. వారి అపార్ట్మెంట్ లో విగతజీవులుగా కనిపిస్తారు. ఏవో వ్యక్తిగత కారణాల వలన జోష్ని ని శివ కాల్చి చంపి తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ఆ కేసుని క్లోజ్ చేస్తారు. అయితే ఇది ఆత్మహత్య కాదని, ప్రీప్లాన్డ్ మర్డర్ అని అనుమానిస్తాడు కర్ణ. మరి తన అనుమానం నిజమైయ్యిందా? అది హత్య అని నిరూపించడానికి కర్ణ ఎలాంటి క్లూస్ ని సేకరించాడు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్ళు ఎదురుకున్నాడు? చివరికి ఇందులో హంతకులు ఎవరనేది తెరపై చూడాలి.
చిత్ర పరిశ్రమలో ముద్ర వేసుకోవాలంటే.. కంటెంట్ లో కొత్తదనం, ఒరిజినాలిటీ వుండాలి. కథని చెప్పే క్రమంలో నిజాయితీ వుండాలి. అన్నిటికంటే ముఖ్యంగా టార్గెట్ ఆడియన్స్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఈ మూడు అంశాలు ఉన్నప్పుడే చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల మెప్పుపొందే అవకాశం వుంది. ‘అథర్వ’సినిమా విషయానికి వస్తే ఈ మూడు అంశాల్నీ తృప్తి పరచలేకపోయింది. ఇప్పటివరకూ క్లూస్ టీం నేపధ్యంలో సినిమా రాలేదు కదా ఇది ఒరిజినల్ పాయింటే కదా అనొచ్చు. అయితే పాయింట్ ఎత్తుకోగానే సరిపోదు దానికి న్యాయం చేయాలి. క్లూస్ టీంలో వుండే సవాళ్ళు అక్కడ ఉద్యోగాలు, పరిమితులు, నేర పరిశోదనలో వారి ప్రాముఖ్యత ఇవన్నీ ఆసక్తికరంగా చూపించే అవకాశం వుంది. కానీ దర్శకుడు ఈ నేపధ్యానికి కమర్షియల్ సినిమా కోటింగ్ ఇచ్చాడు. దీంతో అందులో వున్న సీరియస్ నెస్ దెబ్బకొట్టింది.
క్రైమ్ థ్రిల్లర్స్ కి హీరోయిజం, పాటలు అనవసరం. గుండె బాదుకొని డైలాగులు చెప్పడం శుద్ధదండగ. సమాజానికి మెసేజ్ ఇవ్వడం పరమ నాన్ సింక్. హీరోకి ప్రేమకథా ఉందా లేదా? అనే ప్రేక్షకుడు అస్సల్ పట్టించుకోడు. అయితే దర్శకుడు మాత్రం ఇవన్నీ పట్టించుకున్నాడు. క్లూస్ టీం నేపధ్యంలో నడపాల్సిన కథని కర్ణ పాత్రకు అనవసరమైన బిల్దప్పులు ఇచ్చుకుంటూ నడిపాడు. హీరోకి జాబ్ వస్తే ఆ జాబ్ ని ఊహించుకుంటూ ఓ మాస్ పాట పాడుకుంటూ డ్యాన్స్ చేస్తాడు. ప్రస్తుతం పంక్తు కమర్షియల్ సినిమాలు కూడా ఈ తరహా ట్రీట్మెంట్ కి దూరంగా ఉంటున్నాయి. క్లూస్ టీంలో జాయిన్ అయిన కర్ణకి కాలేజీలో చదువుకున్న రోజుల్లో ఓ అమ్మాయి కనిపిస్తుంది. మళ్ళీ ఆమెను ఊహించుకొని ఓ పాట పాడుకుంటాడు. మాస్ కి పరాకాష్టగా శవయాత్ర ముందు కూడా డ్యాన్స్ చేస్తాడు. ఇదంతా తెరపై చూస్తున్నపుడు అసలు ఇందులోని కథ ఏమిటి? ట్రైలర్ ఎలా కట్ చేశారు? ఏం చూపిస్తున్నారు? అని బిత్తరపోవడం ప్రేక్షకుడి వంతు అవుతుంది. సరిగ్గా ఇంటర్వెల్ టైమ్ ఇందులో అసలు పాయింట్ హీరోయిన్ హత్య తెరపైకి వస్తుంది.
పోనీ సెకండ్ హాఫ్ లో నేర పరిశోదన చురుగ్గా సాగుతుందా అని ఆశపడితే.. ఇక అక్కడి నుంచి సిసి కెమెరాలు చుసుకోవడాలు, ఫోన్ నెంబర్లు ఫిల్టర్ చేసుకోడాలు, బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకొవడాలు.. ఇలా సాగుతుంది నేర పరిశోదన. ఇది చాలదన్నట్టు కర్ణ పాత్రకు కు అవసరం లేని మరో ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. నిజానికి క్రైమ్ థ్రిల్లర్స్ అభిమానించే ప్రేక్షకుల ఐక్యూ కొంచెం చురుగ్గా వుంటుంది. ఒక కేసుని పోలీసులు సింపుల్ గా క్లోజ్ చేసినప్పుడే అక్కడే ఎదో మతలబు వుందని పసిగట్టేస్తారు. ఈ విషయం కర్ణకి అర్ధం కావడానికి కొన్ని సీన్లు పడుతుంది. అలాగే ఈ సినిమా బిగినింగ్ లో ఒక క్రైమ్ రిపోర్ట్, మరో ఎనలిస్ట్ హత్యకు గురౌతారు. ఈ కేసుకి అసలు కేసు లింక్ వుంటుందని ముందే తెలిసిపోతుంది. ఇలాంటి డాట్స్ ని కలిపేటప్పుడు కథనం ఉత్తేజంగా ఆసక్తికరంగా వుండాలి. ఐతే ఇందులో అలాంటి వేగం ఉత్తేజం కనిపించదు. దర్శకుడు తనకు అనుకూలమైన సన్నివేశాలు పేర్చుకుంటూ వెళ్ళాడు.
క్రైమ్ థ్రిల్లర్స్ లో ప్రేక్షకులని హుక్ చేసి వుంచడం చాలా ముఖ్యం. మొదటి సీన్ లో క్రైమ్ ని చూపించి.. మళ్ళీ క్లైమాక్స్ లో ఆ సీన్ కి రావడం ఇలాంటి జానర్ కథలకు నప్పే స్క్రీన్ ప్లే. ఇందులో అదే ఫాలో అయ్యారు. అయితే ఈ సన్నివేశాల అల్లిక మాత్రం థ్రిల్ ని పంచలేకపోయింది. కథ, కథనంలో చాలా చోట్ల అపరిపక్వత కనిపిస్తోంది. ప్రేక్షకుడిని మలుపులతో ఆకట్టుకోవాలనే ప్రయత్నం దర్శకుడిలో కనిపించింది కానీ అయితే ఆ మలుపులు క్రైమ్ డ్రామాలో సహజంగా కుదరలేదు. కర్నాటక టూరు, హీరోయిన్స్ బ్లాక్ మెయిల్ ఎపిసోడ్స్ తేలిపోయాయి. క్లైమాక్స్ లో కూడా కొత్తదనం లేదు. ఈ కథకు పార్ట్ 2 లీడ్ కూడా ఇచ్చారు.
ఇలాంటి కథలకు హీరో తెలివితేటలు మైండ్ గేమ్ తో తప్పితే హీరోయిజంతో పనివుండదు. ఐతే దర్శకుడు కర్ణ పాత్రని కొంచెం కమర్షియల్ గా ట్రీట్ చేశాడు. కర్ణ పాత్రలో కార్తీక్ రాజు ఎంత ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నా అది నాన్ సింక్ గానే అనిపిస్తుంటుంది. పైగా ఆ పాత్రని చాలా డ్రాగ్ చేసేశారు. కర్ణని క్లూస్ టీంలోకి తీసుకురావడానికే చాలా సన్నివేశాలు తీసుకున్నారు. ఆ ప్రయాణం అంతా కథకు లింక్ లేకుండా వుంటుంది. ఊరు గురించి కర్ణ చెప్పే లాంగ్ డైలాగులు వినడానికి బావున్నా, వాటికీ ఈ కథకీ ఉన్న ఏమిటి సంబంధం అనిపిస్తుంది. హీరోయిన్ కేసుని పర్శనల్ తీసుకుంటూ చాలా ఎమోషనల్ డైలాగులు చెప్పేయడం అంతగా నప్పలేదు. చాలా సహజంగా ఆ కేసుని డీల్ చేయొచ్చు. అంత లౌడ్ యాక్టింగ్ అనవసరం. అయితే తన స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ కథలని ఎంచుకోవడంలో జాగ్రత్తపడాలి. నిత్య ( సిమ్రాన్ చౌదరి) పాత్రకు కూడా ప్రాధాన్యత లేదు. ప్రేమకథ కుదరలేదు. హీరోయిన్ కి నిత్యని ఫ్రెండ్ గా చూపించి దాని ద్వారా కర్ణ ని ఆ కేసులోకి తీసుకెళ్ళే తీరుతో ఈ కథకు లెంత్ పెగిగింది కానీ థ్రిల్ యాడ్ అవ్వలేదు. మిగతా పాత్రలన్నీ పరిదిమేర వున్నాయి.
టెక్నికల్ గా కూడా సినిమా మెప్పించలేకపోయింది. చాలా రెగ్యులర్ లైటింగ్, కలర్ గ్రేడింగ్ లో సన్నివేశాలని లాగించేశారు. ఎడిటర్ థ్రిల్ ని పట్టుకోలేకపోయాడు. పాటలు అనవసరం. నేపధ్య సంగీతం కూడా బిలో యావరేజ్. మాటలు ఆకట్టుకోవు. నిర్మాణ పరంగా పరిమితులు కనిపిస్తూనే వుంటాయి. క్లూస్ టీం నేపధ్యంలో ఓ క్రైమ్ థ్రిల్లర్ ని చూపించాలనేది దర్శకుడి ఆలోచన. అయితే ఆలోచనని ఆసక్తికరంగా, ఉత్కంఠ రేకెత్తించేలా మాత్రం మలచలేకపోయారు.
తెలుగు360 రేటింగ్ : 2/5