జనసేన – టీడీపీ పొత్తులపై ఏ నాయకుడు కార్యకర్తలు తప్పుగా బయట గానీ, సోషల్ మీడియాలో కానీ మాట్లాడినా వారిని వైసీపీ కోవర్టులుగా చూడాలని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పవన్ మాట్లాడారు. ఏపీలో టీడీపీ, తెలంగాణలో బీజేపీతో జనసేన కలవటంపై వైసీపీ విమర్శలు చేస్తోందని తాను ప్రజల మంచి కోసమే నిర్ణయాలు తీసుకుంటానని స్పష్టం చేశారు. దీని వెనుక వ్యూహాలు ఉంటాయన్నారు. అసలు తమ పొత్తులపై ఈ మాట అనటానికి వైసీపీకి అర్హత లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీతో, ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నామంటే అది ప్రజల మంచి కోసమేనని స్ఫష్టం చేశారు. దీనిపై విమర్శించే స్థాయి వైసీపీ నేతలకు లేదన్నారు. వైసీపీని సమర్థంగా ఎదుర్కోవడానికే రాష్ట్రంలో టీడీపీ, జనసేనలు కలిశాయని స్పష్టం చేశారు.
పార్టీ నుంచి వెళ్లిపోతామని అనేక మంది బెదిరించారు. ఇష్టం లేకుంటే వెళ్లిపోవాలని వారికి చెప్పా. మేము టీడీపీ వెనుక నడవడం లేదు. ఆ పార్టీతో కలిసి నడుస్తున్నామని పవన్ స్పష్టం చేశారు. జనసేనకు యువతే పెద్ద బలమన్నారు. మన పార్టీకి యువత బలం చూసి బీజేపీ పెద్దలే ఆశ్చర్యపోయారని గుర్తు చేశారు. ఏపీలో జనసేనకు నేడు ఆరున్నర లక్షల కేడర్ ఉందన్నారు. ఇంతమంది అభిమానుల బలం ఉందని మనకు గర్వం రాకూడదని.. పొరుగు రాష్ట్రాల యువత కూడా మనకు మద్దతిస్తున్నారని చెప్పారు. తనను తన భావజాలాన్ని నమ్మే యువత మా వెంట వస్తున్నారు.. యువత ఆదరణ చూసి తెలంగాణలో 8 చోట్ల పోటీ చేశామని స్పష్టం చేశారు. నా సినిమాలు ఆపేసినా, నేను బస చేసిన హోటల్ వద్దకు వచ్చి బెదిరించి ఇబ్బంది పెట్టినా నేను ఏనాడూ జాతీయ నేతల వద్దకు వెళ్లి వారి సహాయం అడగలేదు.’ అని పవన్ స్పష్టం చేశారు.
‘మన బలం చూపించకపోతే గుర్తింపు ఇవ్వరు. స్వార్థం వదిలేయాలని నాయకులను కోరుతున్నా. చేసే పని, పోరాటమే మనకు గుర్తింపు ఇస్తుంది.’ అని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. కార్యకర్తల చిత్తశుద్ధి వల్లే మన పార్టీకి ఢిల్లీలోనూ గుర్తింపు వచ్చిందన్నారు. వైసీపీ అసలు భావజాలం లేని పార్టీ అని.. సమాజాన్ని ఎలా చూస్తామనే అంశంపై జనసేనలో స్పష్టమైన అవగాహన ఉందన్నారు. నేను మొదటి నుంచీ పదవులు కోరుకోలేదని. నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకు సేవ చేయాలని అనుకున్నాన్నారు.