దేశంలో అత్యంత యాక్యురసీ ఉన్న సర్వే సంస్థల్లో నెంబర్ వన్ అయిన మై యాక్సిస్ ఇండియా ఎగ్జిట్ పోల్ లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తేలింది. కాంగ్రెస్ పార్టీకి 63 నుంచి 73 సీట్ల వరకూ వస్తాయని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. వివిధ రీజియన్లలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలిపింది. ఒక్క హైదరాబాద్ పరిధిలో మాత్రమే బీఆర్ఎస్ కాస్త మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీదే హవా కనిపిస్తోంది.
ఓట్ షేర్ లోనూ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం చూపించారు. బీఆర్ఎస్ పార్టీకి అధమంగా 34 బెస్ట్ సిట్యూయేషన్ లో 44 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉంది. అంతకు మించి వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను గెల్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అదే నాలుగు నుంచి ఎనిమిది వరకూ సీట్లను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఓ దశలో బీజేపీ నే తెలంగాణలో అధికారానికి దగ్గరగా ఉందనుకున్నారు. కానీ చివరికి పాత స్థాయిలోనే ఉండిపోయి.
మజ్లిస్ ఈ సారి ఓ స్థానం కోల్పోవడం ఖాయమయింది. ఆ పార్టీకి ఆరు స్థానాలే వస్తాయని అంచనాలు వేశారు. అంటే నాంపల్లి సీటులో ఫిరోజ్ ఖాన్ ఎమ్మెల్యే గా గెలవబోతున్నారని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డికి 21 శాతం మంది ప్రజల మద్దతు లభించగా.. కాంగ్రెస్ నుంచి ఎవరైనా ఓకేనని 22 శాతం మంది తెలిపారు. కేసీఆర్ సీఎంగా 32 శాతం మంది మాత్రమే అంగీకారం తెలిపారు.
లోకల్ లో ఊరు పేరు లేని ఒకటి , రెండు సంస్థలు తప్ప అన్నీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విజయం ఖాయమని తేల్చాయి. అసలు ఫలితాలు ఆదివారం మధ్యాహ్నం కల్లా తేలిపోనున్నాయి.