కొన్ని కొన్నిసార్లు మితి మీరిన అంచనాల్ని తగ్గించడానికో, కంట్రోల్ లో పెట్టడానికో అన్నట్టు ట్రైలర్లు కట్ చేస్తుంటారు. ‘సలార్’ ట్రైలర్ చూసిన మెజార్టీ అభిప్రాయం ఇదే. దాదాపు మూడున్నర నిమిషాల సుదీర్ఘమైన ట్రైలర్ ఇది. అందులో సగం `సలార్` ప్రపంచాన్ని పరిచయం చేయడానికే వాడుకొన్నాడు దర్శకుడు. సగం ట్రైలర్ అయ్యాక గానీ, హీరో ఎంట్రీ ఇవ్వలేదు. అదో వెలితిగా మారింది. ప్రభాస్ నుంచి కూడా బలమైన డైలాగులు పలికించలేదు. సాధారణంగా ప్రశాంత్ నీల్ రాసుకొనే డైలాగులు, ఆయన ఇచ్చే ఎలివేషన్లూ ఓ రేంజ్ లో ఉంటాయి. ‘కేజీఎఫ్’ రెండు భాగాల్లోనూ అదే చూశాం కూడా. ‘సలార్’ లో అయితే అలా దిమ్మ తిరిగిపోయే రేంజ్లో డైలాగులేం వదల్లేదు.
అయితే ఈ మూడున్నర నిమిషాల్లో తాను ఏం చెప్పాలనుకొంటున్నాడో, ఎలాంటి సినిమా చూపించాలనుకొంటున్నాడో ఓ క్లారిటీ అయితే ఇచ్చేశాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్‌లోని బొగ్గు గనుల్లో చూసిన సీన్లు, షాట్లూ, అక్కడి పాత్రలూ, అలాంటి వేషధారణలూ ఇక్కడా రిపీట్ అవ్వబోతున్నాయని స్పష్టంగా డిక్లేర్ చేసేశాడు. దాంతో తన పని కాస్త ఈజీ అయ్యింది. ఎలాంటి సినిమా అనేది తెలిసిపోయాక.. ప్రేక్షకుడు ఓపెన్ మైండ్ తోనే సినిమా చూస్తాడు. సినిమాకి ఓరకంగా అది లాభం కూడా. ఇంత సుదీర్ఘమైన ట్రైలర్ కట్ చేయడంలో దర్శకుడి ప్రధాన ఉద్దేశం అదే. ఈ ట్రైలర్లో దర్శకుడు చెప్పని, చూపించని చాలా పాత్రలు ఉన్నాయన్న విషయం అర్థమవుతోంది. శ్రుతి హాసన్ పాత్రపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ఈ కథలో పాటలకు చాలా తక్కువ స్కోప్ ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే ఇప్పటి వరకూ ఒక్క పాట కూడా విడుదల చేయలేదు. పాటల్ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రూపంలో వాడుకొనే ఛాన్సుంది. చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఈ ట్రైలర్ నచ్చలేదు. అదే విషయాన్ని సోషల్ మీడియాలో నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. కేజీఎఫ్ కి ఎక్స్టెన్షన్ చూసినట్టు ఉందని పెదవి విరుస్తున్నారు. కాస్త లో హైప్ తో సినిమా చూస్తే.. అప్పుడు మరింత ఎక్కువ కిక్ ఇవ్వొచ్చన్నది దర్శక నిర్మాతల ఐడియా కావొచ్చు.