ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మెన్ గా సూపర్ హిట్లు కొట్టిన రాజశేఖర్ కెరీర్ అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితుల్లో ‘ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మెన్’ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టు టర్న్ తీసుకొంది. నిజానికి రాజశేఖర్‌ని కీలక పాత్రల్లో వాడుకోవాలని చాలామంది దర్శకులు భావించారు. కొన్ని కథలూ ఆయన దగ్గరకు వెళ్లాయి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో ప్రకాష్ రాజ్ పాత్ర ఆయన్నే వరించింది. కానీ ఆయన కాదనుకొన్నారు. కొన్ని సార్లు రాజశేఖర్ ని ఎంచుకోవాలంటే దర్శక నిర్మాతలే భయపడ్డారు. రాజశేఖర్ చెప్పిన టైమ్ కి సెట్ కి రాడు, తను వచ్చిన సమయానికే షూటింగ్ పెట్టుకోవాలన్న ఓ అపవాదు ఉంది. రాజశేఖర్ కెరీర్ ఇప్పుడు ఈ స్థితిలో ఉండడానికి కారణం కూడా అదే.
అయితే ఇప్పుడు ఎక్ట్స్ ట్రా – ఆర్డినరీ మెన్ విషయంలో మాత్రం రాజశేఖర్ లో స్పష్టమైన మార్పు కనిపించిందని టీమ్ చెబుతోంది. నితిన్ – వక్కంతం వంశీ కాంబోలో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రంలో రాజశేఖర్ కీలక పాత్రలో నటించారు. ఏడింటికి షూటింగ్ అంటే ఆయన ఆరున్నరకే సెట్ లో ఉండేవార్ట. ఆయన టైమింగ్ చూసి, చిత్రబృందం ఆశ్చర్యపోయిందట. తన సీన్ అయిపోయినా.. పేకప్ చెప్పేసేంత వరకూ రాజశేఖర్ సెట్లోనే ఉండేవారని, పారితోషికం విషయంలోనూ నిర్మాతల్ని ఇబ్బంది పెట్టలేదని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజంగా రాజశేఖర్ లో ఈ మార్పు ఆహ్వానించదగినదే. ఎందుకంటే చిత్రసీమకు క్యారెక్టర్ ఆర్టిస్టుల అవసరం ఉంది. రాజశేఖర్ లాంటి నటుడు క్రూరమైన విలన్ గా కనిపిస్తే ఆ పాత్రకొచ్చే మైలేజీ వేరుగా ఉంటుంది. దర్శకులకూ ఓ మంచి ఆప్షన్ దొరికినట్టవుతుంది. రాజశేఖర్ కెరీర్ కూడా మరో టర్న్ తీసుకొంటుంది.