ఎన్ని స్థానాలు వచ్చాయన్నదానితో లెక్క లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దాని వెనకు అంతర్గత కసరత్తు ఎక్కువగానే ఉందని కాంగ్రెస్కు సమాచారం అందడంతో హుటాహుటిన డీకే శివకుమార్ ను హైదరాబాద్ కు పంపింది హైకమాండ్. గెలుస్తారని భావిస్తున్న 80 మంది అభ్యర్థుల్ని కనిపెట్టుకుని ఉండేలా ఏఐసీసీ పరిశీలకుల్ని నియమించారు. కౌంటింగ్ లో వారు గెలుస్తారంటే… పత్రం తీసుకునే వరకూ వారి వెంటే ఉండి… హైదరాబాద్ వస్తారు. ఓడిపోతారనుకుంటే వాళ్లతో పని ఉండదు కాబట్టి పక్కన పెట్టేస్తారు.
కౌంటింగ్ ముగిసే సమయానికి గెలిచిన అభ్యర్థులందర్నీ ఒక్క చోటికి చేర్చాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. తమ అభ్యర్థులతో కేసీఆర్ నేరుగా మాట్లాడుతున్నారని డీకే శివకుమార్ ఆరోపిస్తున్నారు. హంగ్ వచ్చే అవకాశం ఉందని… బీఆర్ఎస్ భావిస్తోంది. మజ్లిస్ కు వచ్చే ఆరు సీట్లు ఎలాగూ బీఆర్ఎస్ వైపే ఉంటాయి. 40 నుంచి 45 సీట్లు వచ్చినా మిగతా మిగతా అవసరమయ్యే పదో , పన్నెండో లెక్కను కాంగ్రెస్ నుంచి కవర్ చేసుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాల పేరుతో ఎక్కువగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి అవకాశాలు కల్పించింది. వారు డబ్బులు ఖర్చు పెట్టుకుని గట్టిగా పని చేశాయి. చాలా నియోజకవర్గాలలో పారాచూట్ లీడర్లు ముందుంజలో ఉన్నారు. వీరందరితో పాత పరిచయాలు ఉన్నందున బీఆర్ఎస్ వర్గాలు టచ్ లోకి వెళ్తున్నారని అంటున్నారు. కొంత మందితో నేరుగా కేసీఆర్ మాట్లాడుతున్నారని అంటున్నారు. కేసీఆర్ రాజకీయాల గురించి తెలుసు కాబట్టి.. కాంగ్రెస్ పార్టీ ఎందుకైనా మంచిదని జాగ్రత్తపడుతోంది.