బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న చోట్ల ఈడీ, ఐటీ అధికారులు చేసే హడావుడి గురించి చెప్పాల్సిన పని లేదు. తమిళనాడులో ఇది మరీ ఎక్కువగా ఉంది. ఇద్దరు మంత్రుల్ని అరెస్టులు కూడా చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఈడీ శాఖను తన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుని రాజకీయ మిత్రపక్షంగా చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పుడు ఈడీ అధికారులకు కౌంటర్ ప్రారంభించింది తమిళనాడు ప్రభుత్వం. ఈడీ అధికారుల్లో లంచగొండులను పట్టుకుని అరెస్టు చేయడం ప్రారంభించింది. అంకిత్ తివారీ అనే ఈడీ అధికారిని తమిళనాడులో ని దిండుగల్‌లో విజిలెన్స్, అవినీతి నిరోధక విభాగం అధికారులు పట్టుకున్నారు. రూ. 20 లక్షలు లంచం తీసుకుంటూడగా పట్టుకున్నారు. దీంతో దుమారం ప్రారంభమయింది.
అంకిత్ తివారి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. తమిళనాడులో విధఉలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులో ఓ కీలక శాఖకు చెందిన అధికారికి ఆయన ఫోన్ చేసి మీపై దర్యాప్తు చేయాలని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందని… ఈడీ ఆఫీసుకు రావాలని ఆదేశించారు. ఉద్యోగి 30న ఈడీ కార్యాలయానికి వెళ్లాడు. రూ. 3 కోట్లు ఇస్తే కేసును క్లోజ్ చేస్తానని అక్కడ తివారీ అతడితో బేరం పెట్టాడు. ఆ తర్వాత రూ. 51 లక్షలు ఇస్తే సరిపోతుందని, ఉన్నతాధికారులు కూడా అందుకు సరేనన్నారని చెప్పుకొచ్చాడు. అంగీకరించిన ప్రభుత్వ ఉద్యోగి నవంబరు 1న తొలి ఇన్స్టాల్మెంట్గా రూ. 20 లక్షలు అందించాడు.
అంకిత్ వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన ప్రభుత్వ ఉద్యోగి నవంబరు 30న డీవీసీఏకు ఫిర్యాదు చేశాడు. తర్వాత ఉద్యోగి నుంచి మరోసారి రూ. 20 లక్షలు తీసుకుంటుండగా రాష్ట్ర విజిలెన్స్, అవినీతి నిరోధక విభాగం రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకుంది. నిందితుడికి కోర్టు ఈ నెల 15 వరకు జుడీషియల్ రిమాండ్ విధించింది. ఆ తర్వాత డీవీసీఏ అధికారులు మధురైలోని ఈడీ కార్యాలయంతోపాటు నిందితుడు అంకిత్ తివారీ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. అంకిత్ తివారీ ఇలా ఎంతోమందిని బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. మధురై, చెన్నైకి చెందిన పలువురి ఈడీ అధికారుల హస్తం కూడా దీనివెనక ఉందని తమిళనాడు పోలీసులు ప్రకటించారు. అంటే ఈడీ అధికారులందర్నీ ఫ్రేమ్ చేసినట్లు అవుతోంది. ఈ వ్యవహారం తమిళనాడులో కలకలం రేపుతోంది.
బీజేపీయేతర ప్రభుత్వాలకు.. ఈడీ అధికారుల్ని ఎలా టార్గెట్ చేయాలో తమిళనాడు చూపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.