ఎన్నికలకు ముందు కుటుంబాన్ని్ ముందు పెట్టి ఓట్లు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికలలో గెలిచారు. ఆయన కుటుంబాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించిన తప్పిదం తమకు ఎందుకు అనుకున్నారేమో కానీ.. ఈటలను వద్దుకుని పాడి కౌశిక్ రెడ్డికే ఓట్లేశారు. ఆయనే విజయం సాధించారు. కుటుంబాన్ని హుజూరాబాద్ ప్రజలు కాపాడారు. కానీ ఆయన పార్టీ బీఆర్ఎస్ ఓడిపోయింది.
2018లోనూ ఆయన హూజూరాబాద్ నుంచే పోటీ చేశారు. కాకపోతే.. కాంగ్రెస్ తరపున. బీఆర్ఎస్ తరపున ఈటల పోటీ చేశారు. మారిన రాజకీయంలో ఈటల రాజేందర్ బీజేపీ నుంచి పోటీ చేశారు. ఉపఎన్నికల్లో గెలిచినా అసలు ఎన్నికల్లో మాత్రం పరాజయం పాలయ్యారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన బల్మూరి వెంకట్ కు డిపాజిట్ రాలేదు. కానీ ఈ సారి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిగా వొడితెల ప్రణవ్ ను ఎంపిక చేశారు. ఆయన గట్టి పోటీ ఇచ్చారు. యాభై మూడు వేల ఓట్లు తెచ్చుకున్నారు.ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు ఈటలకు పడ్డాయి. కానీ ఈ సారి మాత్రం కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్ కే పడ్డాయి.
దాంతో ఈటల పరాజయం పాలు కాక తప్పలేదు. ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లయితే… సులువుగా విజయం సాధించేవారు. బీజేపీకి క్యాడర్ లేకపోవడం వల్ల.. తనతో పాటు వచ్చిన క్యాడర్ తో మాత్రమే ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. చివరికి ఆయన పరాజయం పాలయ్యారు. గజ్వేల్ లో కూడా కేసీఆర్ చేతిలో ఓడిపోవడతో ఆయన రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడిపోయినట్లయింది.