రాజకీయాల్లో ఓ నేత ఎదిగారంటే అతని పట్టుదలే కాదు.. అతని టార్గెట్ చేసిన నేతల వ్యూహాత్మక తప్పిదాలు కూడా ఉంటాయి. ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేని.. ఒకప్పుుడు టిక్కెట్ కోసం కేసీఆర్ వద్దకే వెళ్లిన రేవంత్ రెడ్డిని… తన ప్రత్యర్థిగా కేసీఆర్ మార్చుకున్నారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆయనను ఎక్కడ లేని క్రేజ్ తీసుకు వచ్చారు. ఉలి దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుదన్నట్లుగా రేవంత్ రెడ్డిని మాస్ లీడర్ గా చేయడానికి కేసీఆర్ ఎన్నో దెబ్బలు వేశారు. అయితే కేసీఆర్ ప్రయత్నాలు నిలువునా ఆయన రాజకీయ జీవితాన్ని అంతం చేయడానికి చేశారు. కానీ వాటిని తన ఉన్నతికి వాడుకున్నారు రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డిపై తెలంగాణలో ఎనభై కేసులు ఉన్నాయి. రేవంత్ రెడ్డికి కేసీఆర్ ప్రధాన ప్రత్యర్థి అయింది ఓటుకు నోటు కేసుతో. ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన కోవర్ట్ ఆపరేషన్ తో ఆయనను ట్రాప్ చేశారు. కెమెరాలు పెట్టి… ఆయనను స్పాట్ లో అరెస్టు చేశారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి విసిరిన చాలెంజులు వైరల్ అయ్యాయి. నిజానికి అప్పుడు కేసీఆర్ టీడీపీకి ఎమ్మెల్యేలను ఆకర్షించారు. రివర్స్ లో నామినేటెడ్ ఎమ్మెల్యేను ఆకర్షించాలని రేవంత్ ప్రయత్నించారు. అక్కడ రేవంత్ కు సానుభూతి లభించింది. ఆ సమయంలో రేవంత్ కుమార్తె పెళ్లి ఉంది. కేవలం పన్నెండు గంటల బెయిల్ పై ఆయన వచ్చి పెళ్లి కి హాజరై మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇలాంటివి రేవంత్ పై ప్రజల్లో సానుభూతిని పెంచాయి.
అందరూ నేతుల కేసీఆర్కు లొంగిపోతే రేవంత్ రెడ్డి ఒక్కడే ఎదురునిలబడాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుండి రేవంత్ రాజకీయ జీవితాన్ని అంతం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ రేవంత్ తగ్గలేదు. 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇలా నామినేషన్ వేశారో లేదో అలా ఆయన ఇంటిపై ఐటీ, ఈడీ దాడి చేశాయి. మూడు రోజుల పాటు ఆయనను ఇంట్లోనే నిర్బంధించారు. బయట మీడియాలో రేవంత్ పై విస్తృతమైన వ్యతిరేక ప్రచారం జరిగింది. ఆయన దగ్గర వందల కోట్లు ఆస్తులు దొరికాయని విదేశాల్లో లావాదేవీలు ఉన్నాయని కొన్ని పత్రాలు మీడియాలో ప్రదర్శించారు. కానీ అదంతా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా జరిగిన ఆర్గనైడ్డ్ ప్రచారం అని.. అవి ఫేక్ పేపర్స్ అని తర్వాత తేలింది. ఆ ఎన్నికలలో ఓడిపోయారు.
కానీ తాను ఎంచుకున్న మార్గంలో తగిలిన ఎదురుదెబ్బల్ని చూసి భయపడే నాయకుడ్ని కాదని నిరూపించి ముందుకు సాగారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన కేసీఆర్ ఎప్పటికప్పుడు దెబ్బకొడుతూనే ఉన్నారు. పార్టీలో చేర్చుకునేవాళ్లు.. కోవర్టులతో కావాల్సిన రాజకీయం చేసేవారు. చేతులెత్తేసే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి వచ్చింది. రేవంత్ కు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలనుకున్నారని ప్రచారం జరిగినప్పుడల్లా ఆయనపై ఏదో ఓ కేసు నమోదు చేసి జైలుకు పంపేవారు. అలాంటి వ్యక్తికి పీసీసీ చీఫ్ పోస్ట్ ఇస్తారా అని కేటీఆర్ విమర్శించేవారు. రేవంత్ రెడ్డి ఎలాంటి నేతో తెలుసు కాబట్టి అలా చేసేవారు. కానీ రేవంత్ ను అడ్డుకోలేకపోయారు. రేవంత్ ప్రతి ఎదుగుదలకు… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ కొట్టిన దెబ్బలే కారణం. పట్టుదలగా నేలకు కొట్టిన బంతిలాగా ఆయన ఎదిగారు.