ఎన్నికల్లో ఓటు వేసినప్పటి నుండి కేసీఆర్ బయట కనిపించలేదు. ఎన్నికల ప్రచారసభల్లో తప్ప.. మీడియాతో ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడలేదు. ఈ మధ్య సికింద్రాబాద్ బహిరంగసభను వర్షం కారణంగా రద్దు చేసుకున్న రోజున మీడియా సమావేశం పెడతారనుకున్నారు. కానీ పెట్టలేదు. ఓటింగ్ సరళిపై స్పందించలేదు. ఫలితాలపైనా స్పందించలేదు. చివరికి గవర్నర్ కు రాజీనామా పత్రం కూడా స్వయంగా ఇవ్వలేదు. పీఏతో పంపించారు. ఇంత కాలం ఆమెను టార్గెట్ చేసి.. ఇప్పుడు ఆమె దగ్గరకు వెళ్లి రాజీనామా ఇవ్వడం నామోషీగా ఫీలై….వెళ్లలేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పై ప్రజలు భారం పెట్టారు. పదేళ్లు అధికారం ఇచ్చిన తర్వాత ఐదేళ్లు ప్రతిపక్ష పాత్ర పోషించాలని తీర్పు ఇచ్చారు. కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో ఇప్పుడు సభలో అడుగుపెట్టాల్సి ఉంటుంది. మరి కేసీఆర్ ఆ పని చేయగలరా అంటే.. ఆయన గురించి తెలిసిన వారెవరూ అది జరగదమ్మా అనే అంటారు. ఆయనకు ఇష్టం లేని వ్యుక్తుల్ని చూసేందుకు ఇష్టపడరని అంటున్నారు. తాను తేలికగా తీసి పడేసిన రేవంత్ రెడ్డి .. సభా నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉంటే.. ఆయన ఎదురుగా ప్రతిపక్ష నేతగా కూర్చోవడానికి సిద్ధపడకపోవచ్చని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
అసెంబ్లీలో అయినా రాజకీయంలో అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఆయనకు ఇప్పుడు సీఎం అనే కవచం లభించే అవకాశం ఉంది. అది లభిస్తే ఆయన ఎలా రాజకీయం చేస్తారో అంచనా వేయడం కష్టం. బీఆర్ఎస్ అధినేత రాజకీయాల వల్ల తీవ్రంగా వేధింపులకు గురయింది రేవంత్ రెడ్డినే. ఆయన పగ తీర్చుకోవాలనుకుంటే.. చేసే రాజకీయం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం అంత సులువు కాదన్న వాదన బీఆర్ఎస్ లో నే వినిపిస్తోంది. కేసీఆర్ లీడ్ తీసుకోవాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. మరి కేసీఆర్ ఏం చేయబోతున్నారో వేచి చూడాల్సి ఉంది.