నేను ఢిల్లీకి పోతున్నా .. మీరంతా ఆశీర్వదించాలే అని జిల్లాల వారీగా సభలు పెట్టి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. అప్పుడే ఆయన భారత రాష్ట్ర సమితిని పెట్టారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాలకు పోనవసరం లేదు.. అసలు తెలంగాణకే అవసరం లేదని ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు ఇంటే గెలవలేని కేసీఆర్.. రచ్చ గెలవడానికి చాన్స్ లేదు. కనీసం పార్టీ కార్యక్రమాలను కూడా వేరే రాష్ట్రాల్లో పెట్టలేరు. ముందు సొంత రాష్ట్ర ప్రజల అభిమానాన్ని పొందు.. తర్వాత మా రాష్ట్రానికి వద్దువు కానీ అని మొహం మీదనే చెబుతారు.
తెలంగాణలో పదహారు సీట్లు… మహారాష్ట్రలో పాతిక సీట్లు సాధిస్తే నలభై సీట్లు వస్తాయని ఢిల్లీలో చక్రం తిప్పుతామని కేసీఆర్ ఇటీవలి కాలం వరకూ చెప్పారు. ఇలాంటి ఆశలు మిణుకు మిణుకుమనాలన్నా తెలంగాణలో పీఠం నిలబెట్టుకోవాలని ఆయనకు తెలుసు. కానీ ఆ విషయంలో ఫెయిలయ్యారు. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణలోనే ఓడిపోయారు. ఇక జాతీయ రాజకీయాల్లో ఆయన కు ఉండే ప్రాధాన్యత దాదాపుగా సున్నా. కేసీఆర్ మూడో సారి గెలిచి ఉన్నట్లయితే.. ఓ చరిత్ర అనుకోవచ్చు. దేశంలో వరుసగా మూడు సార్లు గెలిచిన అరుదైన రికార్డు సాధించిన వారిలో ఆయన ఒకరయ్యేవారు. ఆయనకు దేశవ్యాప్తంగా ప్రచారం, క్రేజ్ వచ్చేవి. అంతేనా .. భారత రాష్ట్ర సమితిలో చేరికలు కూడా పెరిగేవి. దక్షిణాదిలో .. ఉత్తరాదిలో పార్టీని విస్తరించడానికి అవకాశం ఉండేది.
ఇప్పుడు కేసీఆర్ రాజకీయ పయనం మాత్రం అంత సులువుగా ఉండే అవకాశం లేదు. సభానాయకుడిగా రేవంత్ రెడ్డి ఉంటే.. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వ్యవహరించే అవకాశాలు దాదాపుగా ఉండవు. అదే సమయంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేయడం కూడా సమస్యే. ఎందుకంటే… ఏ కూటమిలో చేరాలన్నా.. ఓ జాతీయ పార్టీ ఆ కూటమిలో ఉంటుంది. జాతీయ రాజకీయ ప్రయత్నంతో కేసీఆర్ తన కుర్చీ కిందకు నీళ్లు తెచ్చుకున్నారని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పుడు అటు రాష్ట్రంలో రాజకీయం చేయలేరు.. అటు కేంద్రంలోనూ.. చక్రం తిప్పలేరు.