గత కొంతకాలంగా చిత్రసీమని రెండు తెలుగు ప్రభుత్వాలూ పట్టించుకోలేదన్నది నిజం. తెలంగాణలో ఎంతో కొంత బెటర్. ఆంధ్రాలో మరీ అధ్వాన్నం. సినిమా వాళ్లను చీడ పురుగులుగా చూసిన సందర్భాలు ఎన్నో. తెలంగాణలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్కీ, చిత్రసీమలోని ప్రముఖులకూ సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల.. టాలీవుడ్ బాధల్ని, సమస్యల్నీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ వరకూ తీసుకెళ్లేవారు. టాలీవుడ్ కి ఏ ఇబ్బంది ఎదురైనా… తలసాని టచ్లో ఉండేవారు. ఆ సమస్య పరిష్కారమయ్యిందా, లేదా అనేది వేరే సంగతి. ఆంధ్రాలో అదీ లేదు కదా..?
రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ.. సినిమా వాళ్లకు అవార్డులు ఇవ్వడం మానేశాయి. అదో అదనపు భారంలా భావించాయి. టికెట్ రేట్ల విషయంలోనూ, అదనపు షోల వ్యవహారంలోనూ టాలీవుడ్ కి ఎలాంటి సపోర్ట్ దొరకలేదు. కొన్ని పెద్ద సినిమాలకు బెన్ ఫిట్ షోలకూ అనుమతి ఇచ్చేవారు కాదు. మరి కాంగ్రెస్ హయాంలో అయినా… టాలీవుడ్ కి మేలు జరుగుతుందా అనేదే ప్రశ్న. ఎంత కాదన్నా.. టాలీవుడ్ కి హైదరాబాద్ ఓ హబ్ లా మారింది. టాలీవుడ్ భవిష్యత్తు అంతా తెలంగాణ రాష్ట్రంతోనే ముడిపడి ఉంది. మరి వచ్చే ప్రభుత్వమైనా తెలుగు చిత్రసీమ సమస్యల్ని పట్టించుకొంటుందా? మొర ఆలకిస్తుందా? పక్కన పెట్టేసిన అవార్డుల ప్రక్రియ మళ్లీ మొదలెడుతుందా? ఇవన్నీ ప్రశ్నలే. గతంలో అయితే టాలీవుడ్ కీ కాంగ్రెస్ నాయకులకూ మంచి అవగాహన ఉండేది. టాలీవుడ్ లో కాంగ్రెస్ పార్టీ జండాను ఎత్తుకొన్న వాళ్లూ, పార్టీకి ప్రచారం చేసిన వాళ్లు, ఎం.ఎల్.ఏ గానూ, ఎం.పీగానూ పోటీ చేసినవాళ్లు ఉండేవారు. పదేళ్లుగా టీఆర్ఎస్ హవా నడిచింది కాబట్టి, మన స్టార్లూ కాంగ్రెస్ ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ పార్టీనే అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. కొత్త ప్రభుత్వానికి చాలా తలనొప్పులు ఉంటాయి. చాలా విషయాలు గాడిన పెట్టాలి. ఆ తరవాతే.. చిత్రసీమ వైపు చూస్తుంది. అప్పటి వరకూ టాలీవుడ్ కూడా కాస్త ఓపిక పట్టాలి.