ప్రతిపక్షాల లెజిస్లేచర్ పార్టీలను విలీనం చేసుకోవడంలో కేసీఆర్ ది ఓ ప్రత్యేక శైలి. తెలంగాణ ఏర్పడిన కొత్తలో రాజకీయ ఏకీకరణ కావాలంటూ… టీడీపీ, కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టులను కూడా వదలకుండా ఎల్పీలను విలీనం చేసుకున్నారు. స్పీకర్ తో గెజిట్ కూడా విడుదల చేయించారు. పార్టీలు విలీనమైపోయాయన్నంతగా ప్రచారం చేశారు. అప్పట్లో ప్రజలు సమర్థించారు. 2018లో ఆ ఫిరాయింపు దార్లు మళ్లీ గెలిచారు. కానీ ఎలాంటి అవసరం లేకపోయినా మళ్లీ 2018లో కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నారు.
అవసరం లేకపోయినా వారిని ఎందుకు విలీనం చేసుకున్నారని తాను కేసీఆర్ ను అడిగితే.. బయట ఉంటే అది పనిగా కుక్కల్లా మొరుగుతూంటారని.. పార్టీలోకి తీసుకొస్తే సైలెంట్ గా ఉంటాారని తనతో చెప్పారని బహిరంగంగానే పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు. టీడీపీ తరపున ఇద్దరు గెలిస్తే ఇద్దర్నీ చేర్చేసుకున్నారు. అప్పట్లోనే ఇలాంటి పరిస్థితి బీఆర్ఎస్ కు వస్తుందని .. అప్పుడు సమర్థించుకోలేరని మండిపడ్డారు. కానీ కేసీఆర్ పట్టించుకోలేదు. ఇప్పుడు కళ్ల ముందుకు వచ్చేస్తోంది.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడానికి కేసీఆర్ ఏం చేశారో ఇప్పుడు బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేయడానికి అంత కంటే ఎక్కువే చేస్తారు. అందులో సందేహం లేదు. ఫలితాలు వచ్చిన గంటల్లోనే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. గ్రేటర్ పరిధిలో మెజార్టీ ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసమైనా కాంగ్రెస్ వైపు చూడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కేసీఆర్ ఇతర ఎమ్మెల్యేల్ని తమ పార్టీలో చేర్చుకోవడానికి ఏం చేశారో కేసీఆర్ అదే చేస్తారు.
ఒక వేళ 39 మంది ఎమ్మెల్యేల్లో 30 మంది పార్టీ ఫిరాయిస్తే.. అది విలీనం అయిపోతుంది. అక్కడి దాకా వస్తుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే.. అలా జరిగినా ప్రజల నుంచి బీఆర్ఎస్ కు .. కేసీఆర్ కు సానుభూతి రాదు. ఎందుకంటే…ఆయన చేసిన పనే కదా అది.