ఆంధ్రప్రదేశ్ తీరం చిగురుటాకులా వణికిపోతోంది. బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపాను తీరం దిశగా వస్తోంది. దీనికి మించాంగ్ అని పేరు పెట్టారు. పేరు కాస్త వెటకారంగా ఉంది కానీ.. ఇది చేసే విధ్వంసం మాత్రం తీవ్రంగా ఉంది. ఇప్పటికే చెన్నైలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. తీరం దాటిదే బాపట్ల, మచిలీపట్నం మధ్య అని తేలడంతో విధ్వంసం ఖాయమన్న హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పటికే ఏపీ తీరం మొత్తం వర్షాలు పడుతున్నాయి. తీరం దాటే సమయంలో గాలులు వంద కిలోమీటర్ల పైనే ఉండవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది.
ఇంత కాలం కరవుు కారణంగా అల్లాడిన రైతులు ఇప్పుడు అతి కష్టం మీద పండించుకున్న పంటకు .. తుపాను ముప్పు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇటీవల వరకూ నాగార్జున సాగర్ పై డ్రామా క్రియేట్ చేసింది కానీ.. తుపాను జాగ్రత్తల విషయంలో దృష్టి పెట్టలేదు. దీంతో రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఉంది. ఆరబెట్టిన ధానాన్ని నిల్వ చేసుకోవడానికి బస్తాలు.. టార్పాలిన్లు వంటివి కూడా సరఫరా చేయలేకపోతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వ వర్గాలు అప్రమత్తంగా ఉంటే కనీసం ప్రాణ నష్టం అయిన జరగకుండా చూసుకోవడానికి అవసరమైనంత సమయం లభించింది. కానీ ముప్పుతీవ్రతను తేలిగ్గా తీసుకుంటున్నారేమో కానీ.. ఎవరికి వారు హెచ్చరికలు జారీ చేసి ఊరుకుంటున్నారు. ప్రత్యేకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. తుపాను తీరం దాటిన తరవాత ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలని ప్రజలు దేవుడ్ని వేడుకుంటున్నారు.