తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక ఎవరు ఉన్నారు. ..? ఎవరేంటి రేవంత్ రెడ్డి, అనుకుంటారు. కానీ అది పైకి కనిపించేది. పడుకున్న కాంగ్రెస్ ను లేపి మరీ పీఠాన్ని అప్పగించింది బీఆర్ఎస్, బీజేపీలే. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉన్నప్పుడు పోటీ అంతా బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉండేది. పేపర్ లీక్స్ సహా ప్రభుత్వంపై పోరాటాలు, ఢిల్లీ లిక్కర్ కేసులో రెండు పార్టీల మధ్య వార్ ను ప్రజలు ఆసక్తిగా చూసేవారు.
కానీ ఒక్క సారిగా బీజేపీ హైకమాండ్ బ్యాక్ ఫుట్ తీసుకుంది. బండి సంజయ్ ను పదవి నుంచి తప్పించింది. కవిత కూడా అరె్స్టు కాలేదు. అదే సమయంలో కేసీఆర్ బీజేపీని విమర్శించడం మానుకున్నారు. ఈ పరిణామం వల్ల బీజేపీ తీవ్రంగా నష్టపోయింది. రెండు పార్టీలు ఒక్కటేనని ప్రజలు గట్టిగా నమ్మడం ప్రారంభించారు. అందుకే బీజేపీలో చేరికలు కూడా ఆగిపోయాయి. ఇతర పార్టీల్లో టిక్కెట్లు రాని వారు కూడా బీజేపీలో చేరలేదు.
ప్రధాని మోదీ నిజామాబాద్ లో చేసిన వ్యాఖ్యలు కూడా రెండు పార్టీలు ఒకటేనన్నట్లుగా ప్రచారం సాగింది. కేసీఆర్ ఎన్డీఏలో చేరుతామన్నారని.. తాము సిద్ధంగా లేమని చెప్పామని మోదీ ప్రకటన చేశారు. దీంతో కేసీఆర్ బీజేపీతో కలిసేందుకు మొహమాటపడరని ప్రజలు భావించారు. రెండు పార్టీలు ఒకటేనని నమ్మడం ప్రారంభించారు. రాజకీయాలపై ఓనమాలు తెలిసిన వారికీ వస్తుంది. పైగా ఆ రెండు పార్టీలు ఇవాళ కాకపోతే రేపైనా కలుస్తాయన్న అభిప్రాయానికి జనం వచ్చారు.
ఫలితంగా రెండు పార్టీలు నష్టపోయాయి. కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ వచ్చింది. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ గెలిచింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేళ్ల పాటు ఏ ఉపఎన్నికలోనూ డిపాజిట్ తెచ్చుకోలేకపోయినా కాంగ్రెస్… అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్, బీజేపీల వ్యూహాలు రివర్స్ కావడం కూడా ఓ కారణం.