రాజకీయాల్లో రాజులు ఎవరూ ఉండరు. ప్రజలే పాలకులు. వారు ఎవర్ని ఎంచుకుంటే వారే పాలకులు. ప్రజలు ఇక అవసరం లేదనుకున్న రోజున నిర్దాక్షిణ్యంగా పంపేస్తారు. ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం అదే. మేము ప్రజలకు ఊహించలేనంత మంచి చేశాం.. వారి బతుకుల్ని బాగు చేశాం… దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టామని ఎంత చెప్పుకున్నా ప్రజలు తమ తీర్పు తాము ఇస్తారు. ప్రభుత్వం వల్ల మేలు జరిగిందో లేదో విశ్లేషించుకుని మరో చాన్స్ ఇవ్వాలో లేదో డిసైడ్ చేసుకుంటారు. తెలంగాణ ఎన్నికల్లో అదే జరిగింది. ఆ మాటకొస్తే అన్ని ఎన్నికల్లోనూ అదే జరుగుతోంది. కానీ తెలంగాణ ఎన్నికలు మాత్రం కాస్త ప్రత్యేకం. ప్రభుత్వంపై అంత కోపం తెచ్చుకోవాల్సిన అంశాలు ఏమున్నాయన్నది చాలా మందికి అర్థం కాలేదు. అభివృద్ధి లేదా సంక్షేమం కారణాలు కాదని.. కేవలం అహంకారం అనే అంశం మీదనే .. ఎన్నికలు జరిగాయని.. ప్రజాస్వామ్యం కోసం ఓటేశారని చివరికి సర్దిచెప్పుకుంటున్నారు. జరిగిందేదో జరిగిపోయింది. తెలంగాణకు ఇప్పుడు యువనాయుకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. జీవం లేకుండా కళేబరంలా మిగిలిపోయిన తెలంగాణ కాంగ్రెస్ కు ఊపిరి పోసి అవమానాలకు గురై.. ఎవరు సారీ చెప్పమన్నా చెప్పి.. సర్దుకుపోయి.. నెట్టుకొచ్చి పార్టీని గెలిపించుకున్నారు రేవంత్ రెడ్డి.దానికి ఆయనకు ఫలితం దక్కింది. ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఇది ఓ రకంగా ఆయన రాజకీయ విజయం . కానీ బాధ్యతల్లో మాత్రం ఆయన అసలు టాస్క్ ఇప్పుడే ప్రారంభమయింది. ఎందకంటే కేసీఆర్ నేతృత్వంలోని రెండు ప్రభుత్వాలు ఓ బెంచ్ మార్క్ సృష్టించాయి. వారు చేసిన అభివృద్ధిని కొనసాగిస్తూనే.. వారి ఓటమికి కారణమైన అంశాలను కవర్ చేసుకుంటూ పాలన చేయాలి. అదేమంత తేలికైన విషయం కాదు.
కేసీఆర్ పాలనను మరిపించాలి – లేకపోతే ?
తెలంగాణ సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ కు రారు. వర్క్ ఫ్రం హోం పాలసీనే అమలు చేస్తారు. కానీ ఏం చేసినా తెలంగాణలో గత పదేళ్లలో ఆయన తనదైన ముద్ర వేశారన్నది కాదనలేని విషయం. కళ్ల ముందు కనిపించే అభివృద్ధి చేయాలని కేసీఆర్ తపించారు. ఈ క్రమంలో ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు ఇచ్చిన కీలక హామీలను మర్చిపోయారు. ఫలితంగా ఆయనపై నెగెటివిటీ పెరిగింది. ఆయన ప్రజలకు కనిపించకపోవడం.. ప్రజల్ని కలిసేందుకు ఇష్టపడకపోవడం.. గడీల్లోనే ఉండిపోవడం కూడా కేసీఆర్ కు మైనస్ అయ్యాయి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు సహా.. హైదరాబాద్ అభివృద్ది.. తెలంగాణ వ్యాప్తంగా మంచి రోడ్లు, నీరు వంటి ఇన్ ఫ్రా అభివృద్ధిలో ఆయన ముద్ర ను అంత తేలికగా తీసేయలేరు. రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ చేసిన అభివృద్ధిని మరిపించేలా చేయడంతో పాటు.. హామీలు ఇచ్చిన సంక్షేమాన్ని సంతృప్తికర స్థాయిలో అమలు చేయాల్సి ఉంటుంది. ఆరు గ్యారంటీ హామీలకే రూ. 70వేల కోట్ల వరకూ ఏడాదికి ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ బడ్జెట్ అంత పెద్ద మొత్తాన్ని భరించలేదు. ఎందుకంటే తెలంగాణ ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేదు. ఉద్యోగులకు జీతాలు కూడా ఆలస్యం అవుతున్నయి. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీతో పాటు.. ముందుగానే జాబ్ క్యాలెండ్ ప్రకటించారు. యువతను ఆకట్టుకోవాలంటే.. ఈ జాబ్ క్యాలెండర్ యధాతథంగా అమలు చేయాల్సి ఉంటుంది. తేడా వస్తే యువతలో అసంతృప్తి పెరిగిపోతుంది. ఇంకా మేనిఫెస్టోలో లెక్కలేనన్ని హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేయాలి. అందరికీ కాకపోయినా పేదలకు.. అవసరం అయిన వారికీ అయినా పథకాలను అమలు చేయలేకపోతే.. ఎంత పాజిటివ్ గా భారీ మెజార్టీలతో ఎమ్మెల్యేలు గెలిచారో.. అంతే వేగంగా క్రేజ్ పడిపోయే అవకాశం ఉంది.
అంచనాలు ఎక్కువ అందు కోవడం అంత తేలిక కాదు – లెక్కలేనన్ని హార్డిల్స్ !
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణం రేవంత్ ఫీల్డ్ లో తిరిగే రాజకీయ నాయకుడు. యువకుడు. అన్ని అంశాలపై అవగాహన ఉంది. అవకాశం ఇస్తే ఏదో చేస్తానని ప్రజల్ని నమ్మించారు. అందుకే.. రేవంత్ రెడ్డిపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఒక్క గ్రేటర్ పరిధిలో తప్ప అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టారు. బహుశా కాంగ్రెస్ వస్తే.. జంట నగరాల్లో జరిగే అభివృద్ది ఆగిపోతుందని వారు భయపడి ఉంటారు. ఇప్పుడు వారి ఆందోళనలను కూడా. తగ్గించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయనకు ఎదురయ్యే హార్డిల్స్ చాలా ఎక్కువ. రేవంత్ కు సొంత పార్టీ నుంచే ఎక్కువ ఆటంకాలు వస్తాయి. కేబినెట్ లో ఎక్కువ మంది ఆయనను సీఎంగా వ్యతిరేకించిన వారే ఉన్నారు. హైకమాండ్ చాయిస్ గా పదవులు పొందిన వారు ఉన్నారు. వారికి రేవంత్ అత్యున్నత స్థాయిలో కూర్చోవడం ఇష్టం లేదు. అందుకే చికాకు పెట్టడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహా అనేక మంది సీనియర్లు కేబినెట్ లో ఉన్నారు. ఇక్కడ కామన్ పాయింట్ ఏమిటంటే వీరు రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రిఫర్ చేయలేదు. తమను తాము ప్రమోట్ చేస్తున్నరు. రేవంత్ రెడ్డి ఆరేళ్ల కిందటే కాంగ్రెస్ లోకి వచ్చారని తాము రాజకీయంగా పుట్టిందే కాంగ్రెస్ లో అని వారి వాదన.తమకే పదవి ఇవ్వాలని పట్టుబట్టారు కూడా. అయితే రాజకీయాల్లో సీనియర్లకే పదవులు ఇవ్వాలనేమీ లేదు.. సామర్థ్యాన్ని చూసి ఇస్తారు. సామర్థ్యం లేకుండా పదవి ఇచ్చినా చేసేదేమీ ఉండదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో గతంలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఘోర పరాజయం పాలయ్యారు. తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలనూ కాపాడుకోలేకపోయారు. అందుకే ఈ సారి హైకమాండ్ రేవంత్ లో డైనమిక్ లీడర్ ను చూసింది. ఆయనకే పీఠం అప్పగించింది. కానీ మంత్రి వర్గం మొత్తాన్ని మీ ఇష్టం అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చే చాన్స్ లేదు. పార్టీని నమ్ముకున్న వారికి అవకాశం కల్పించాల్సిందేని స్పష్టం చేస్తుంది. ఆ లెక్క ప్రకారం.. రేవంత్ రెడ్డిని సీఎంగా వ్యతిరేకించే వాళ్లు అంతా కేబినెట్ లో ఉంటారు. రేవంత్ రెడ్డిని చికాకు పెట్టడమే వారి రాజకీయం అయ్యే చాన్స్ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి విఫలమయ్యారని అనిపిస్తేనే వారికి చాన్స్ వస్తుంది. అందుకే వారి ప్రయత్నాలను రేవంత్ రెడ్డి అడ్డుకోవడం.. వారితో సమన్వయం చేసుకుని ముందుకు సాగడం సీఎంగా రేవంత్ రెడ్డికి మొదటి సవాల్ .
హైకమాండ్ వద్ద ఎంత నమ్మకం పెంచుకుంటే అంత బలం
రేవంత్ రెడ్డి విషయంలో హైకమాండ్ కు ఫిర్యాదు చేయడానికి సీనియర్ల వర్గం ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వంపై ఏ విషయంలోనైనా విమర్శలు వస్తే… ఇతర పార్టీల కంటే ముందు తామే రేవంత్ రెడ్డి సరిగ్గా పాలన చేయలేకపోతున్నారని వారే హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తారు. కాంగ్రెస్ లో ఉన్న ఈ సంస్కృతిపై రేవంత్ రెడ్డికి స్ఫష్టమైన అవగాహన ఉంది. రేవంత్ రెడ్డి న్యూ ఏజ్ పొలిటికల్ లీడర్. అన్ని పార్టీల సంస్కృతిలో ఇట్టే ణమిడిపోతారు. ఆరేళ్ల కిందట కాంగ్రెస్ లో చేరినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నారు. అప్పుడు ఆయన జై ఉత్తమ్ అని నినదించారు. ఇప్పటికీ ఆయన జై ఉత్తమ్ పాఅనాల్సి వచ్చినా అంటారు. ఎలాంటి శషబిషలు పెట్టుకోరు. పీసీసీ చీఫ్ గా హైకమాండ్ ఎంపిక చేసిన సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ల ఎన్ని విమర్శలు చేసినా ఒక్క మాట కూడా ఎదురు కౌంటర్ ఇవ్వలేదు. వారు క్షమాపణలు అడిగితే చెప్పారు. రాజగోపాల్ రెడ్డి మళ్లీ పార్టీలోకి వస్తానంటే… చిన్న అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అలాగే.. బహిరంగంగా ఏ సీనియర్ నేతనూ ఆయన వ్యతిరేకించలేదు. కానీ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. ఆ సీనియర్లే.. రేవంత్ పై గుర్రుగా ఉన్నారు. ఆరోపణలు చేశారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం తనకు ఇచ్చిన బాధ్యతల్ని పక్కాగా నిర్వహించడానికి.. పార్టీని అధికారంలోకి తేవడానికి ఏం చేయాలో అన్నీ చేశారు. సీనియర్లకు గౌరవం ఇచ్చారు కానీ.. వారి ఈగోలను శాటిస్ పై చేయాలని ఎప్పుడూ అనుకులేదు. అది తన సమయం తినేస్తుందని.. లక్ష్యానికి అడ్డు పడుతుందని ఆయనకు బాగా తెలుసు. అందువల్లే సీనియర్లు అసంతృప్తికి గురయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగానే తమను పూచిక పుల్లలాగా తీసేశారని.. ఇప్పుడు సీఎంను చేస్తే తమకు అసలు ప్రాధాన్యత ఉండదని వారి ఆవేదన. అందుకే తమ ప్రాధాన్యత నిలుపుకునేందుకైనా రేవంత్ ను చికాకు పెట్టడానికి .. ఫిర్యాదులు చేయడానికి రెడీగా ఉంటారు. ఇలాంటి రాజకీయాల్ని రేవంత్ రెడ్డి ఎదుర్కోవాల్సిఉంది. కాంగ్రెస్ పార్టీలో హైకమాండే ఫైనల్. అయితే పార్టీకి తిరుగులేదని నమ్మకాన్ని ఇక్కడి నాయకుడు కల్పిస్తే.. హైకమాండ్ ఆ నాయకుడు చెప్పినట్లే ఉంటుంది. ఇతర సీనియర్ల గురించి పట్టించుకోదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విషయంలో అదే జరిగింది. అంతకు ముందు కాంగ్రెస్ నేతలు హైకమాండ్ చెప్పినట్లుగా వినేవారు. వైఎస్ కూడా అదే చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత హైకమాండ్ వద్ద ఆయన బలం ఒక్క సారిగా పెంచుకున్నారు. ఎన్నికల్లో వరుస విజయాలు సాధించడంతో పాటు పార్టీ అభివృద్ధికి తన వంతు సాయం చే్శారు. గాంధీ కుటుంబంపై అమితమైన విధేయత చూపిస్తూ.. పట్టు నిలుపుకున్నారు. అదే సమయంలో సీనియర్ల ప్రాధాన్యం మెల్లగా తగ్గిస్తూ.. తన అనుచరులను పెంచుకున్నారు. అందుకే రెండో సారి ఎన్నికలకు వెళ్లే సమయంలో … టిక్కెట్ల కసరత్తు మొత్తం తానే పూర్తి చేసి హైకమాండ్ తో ప్రకటింప చేసుకున్నారు. మంత్రి వర్గాన్ని సైతం తన ఇష్టం మేరకే ఏర్పాటు చేసుకున్నారు. దివాకర్ రెడ్డి సీనియర్లకూ రెండో మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. కానీ ఒక్కరూ నోరు మెదిపే పరిస్థితి లేదు. ఓ రకంగా ఆయన తిరుగులేని నాయకుడు అయ్యారు. ఆ స్థాయిలో పట్టు సాధిస్తే రేవంత్ రెడ్డికి తిరుగు ఉండదు. అలా చేయాలంటే సీనియర్లను క్రమంగా నిర్వర్యం చేయాల్సి ఉంటుంది. అది అంత తేలిక కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్.. రేవంత్ ను తిరుగులేని నాయకుడు చేయాలని అనుకోదు.. కాంగ్రెస్ పార్టీకి ఆయన వల్ల మేలు జరుగుతుంది.. ఆయన కాంగ్రెస్ పార్టీ వల్ల మేలు పొందుతాడు అన్న కాన్సెప్ట్ వరకే ఆలోచిస్తుంది . అంతకు మించి ముందుకు సాగితే కట్ చేయాలనుకుంటుంది. సీనియర్లను ప్రోత్సహిస్తుంది.
కత్తి మీద సాములా పాలన చేసి.. గట్టెక్కాల్సిందే !
రేవంత్ రెడ్డికి కొన్ని లక్ష్యాలున్నాయి. అందకే ఆయన పోరాటం సీఎం పోస్టు వరకూ వచ్చింది. ఆ లక్ష్యం సీఎం పదవి కాదు. సీఎం పదవి ద్వారా వచ్చే అధికారంతో ఓ ప్రత్యేకత చూపించాలనుకుంటున్నారు. అది తనను రాజకీయంగా వేదింపులకు గురి చేసిన వారి రాజకీయ పతనాన్ని చూడటమా లేకపోతే.. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారి బాగు కోసం శక్తివంచన లేకుండా చేయడమా అన్నది మనకు తెలియదు. రెండూ ఆయన లక్ష్యంగా పెట్టుకుని ఉండవచ్చు. ఇప్పటి వరకూ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే.. అతి తక్కువ సమయంలోనే ఉన్నత స్థానానికి ఎదిగారు. ఎక్కడా ఆయనకు గాడ్ ఫాదర్లు లేరు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా.. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి..ఎలా పెరగాలో అలా పెరుగుతూ వస్తున్నారు. ఆయన ప్రయాణం సాలిడ్ గా సాగలేదు కానీ కనీ ఉలి దెబ్బలు తగిలితేనే రాయి శిల్పం అవుతుందన్నట్లుగా ఎన్నో దెబ్బలు తింటేనే ఆయన ఈ స్థాయికి వచ్చారు. తన లక్ష్యాన్ని అందుకునే వరకూ ఆయన తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. అయితే అది అంత తేలిక కాదనేది కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు చెప్పే నిజం.
రేవంత్ రెడ్డి రాజకీయంగా విజయం సాధించారు. ఇక పాలన పరంగా తన మార్క్ చూపించాల్సి ఉంది. ఇప్పటి వరకూ ప్రజలు ఏమిచేస్తానో చెప్పి ఓట్ల వేయించుకున్నారు. ఇక ముందు ఏం చెప్పారో అది చేయాలి. లేకపోతే ప్రజల చేతిలో ఓటు అనే ఆయుధం ఎప్పుడూ రెడీగానే ఉంటుంది.