ట్రాన్స్ కో, జెన్ కోలు విడివిడిగా వ్యాపారం చేయాలని వాటిని విడదీశారు. కానీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండింటికి ఒకర్నే సీఎండీని చేశారు. ఆయనే మదటి నుంచి రెండు సంస్థల్ని ఏకపక్షంగా నడిపిస్తున్నారు. విద్యుత్ సంస్థల వరకూ ఆయనే రాజు.. ఆయనే మంత్రి. రిటైరైపోయి ఏళ్లు అవుతోంది. కానీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పొడిగిస్తూ పోయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన మరుసటి రోజే.. ఆయన రాజీనామా పత్రం ఇచ్చేశారు. కానీ చేసిందంతా చేసి వెళ్లిపోతే ఎలా లెక్కలు చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి హుకుం జారీ చేశారు. సమీక్షకు ప్రభాకర్ రావు హాజరవుతారా లేదా అన్నదానిపై ఆసక్తి ఏర్పడితే.. హాజరైతే.. సమీక్షలో ఎన్ని నిజాలు చెబుతారన్నది కీలకంగా మారుతోంది.
ప్రభాకర్ రావు తెలంగాణ ఏర్పడిన వెంటనే.. 2014, జూన్ 5న జెన్కో సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది అక్టోబర్ 25న ట్రాన్స్కో ఇన్చార్జిగా నియమితులయ్యారు. తొలుత ఆయన్ను రెండేండ్ల పదవీ కాలానికి సీఎండీగా ప్రభుత్వం నియమించినప్పటికీ.. తర్వాత పదవీ కాలాన్ని పొడిగిస్తూ వస్తున్నది. ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించకుండా వదిలేసిన వ్యూహం కూడా ఆయనదే. చత్తీస్ ఘడ్ నుంచి కరెంట్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుని అక్కడ్నుంచి కరెంట్ వస్తుందని చెప్పి ఏపీ కి బకాయిలు కట్టడం ఆపేశారు. ఇప్పటికీ ఆరు వేలకోట్ల బకాయిలు ఉంటాయి. ఏపీ ప్రభుత్వం ఎంత పోరాడినా.. మీరే మాకివ్వాలంటూ.. సింగరేణి సహా ఇతర సంస్థల లెక్కలు చెప్పి ఎదురుదాడి చేస్తూంటారు.
ఆయన హయాంలో ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి పెరగలేదని… తెలంగాణలో సరఫరా చేసే విద్యుత్ ను అత్యధిక రేట్లతో బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందు కోసం చాలా కుట్రలు జరిగాయని రేవంత్ రెడ్డి గతంలో ఆరోపించారు. శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో ఓ సారి అగ్నిప్రమాదం జరిగింది. దాని వెనుక కుట్ర ఉందని రేవంత్ ఆరోపించారు. ఇవన్నీ లెక్కలు తేలనున్నాయి.
సమీక్షకు ప్రభాకర్ రావు హాజరు కాకపోతే.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పదేళ్ల పాటు సంస్థలను అడ్డగోలుగా నడిపి.. ఎనభై వేల కోట్లకుపైగా అప్పులు చేయడమే కాకుండా… కాంగ్రెస్ గెలిచిందని తెలిసిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తెచ్చే కుట్ర చేశారని అనుమానిస్తున్నారు. అందుకే శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి చేసే పవర్ సమీక్ష పై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.