ఏపీలో నిరుద్యోగుల్ని ప్రభుత్వ పెద్దలు ఓ మాదిరిగా కూడా చూడరు. తాము చేసిందంతా ఇట్టే నమ్మేస్తారని అనుకుంటున్నారు. ఐదేళ్ల కాలంలో ఒక్క జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. విడుదల చేసిన ఒక్కటీ అమలు చేయలేదు. ఇప్పుడు మూడు నెలల్లో ఎన్నికలు ఉండగా హడావుడిగా ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ప్రకారం ఎగ్జామ్స్ ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ పెడతారు. మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఇక ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది.
ఏపీపీఎస్సీ ని మాజీ డీజీపీ గౌతం సవాంగ్ నడుపుతున్నారు. ఆయన ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తారు తప్ప.. నిజంగా ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఆలోచన చేయడంలేదు. గత ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్స్ పరీక్షల విషయంలో జరిగిన అవకతవకలు కోర్టు సాక్షిగా బయటపడ్డాయి. ఇప్పుడు జరగని నియామకాలకు నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ అని జగన్ రెడ్డి ప్రకటించారు. ఐదేళ్లలో కొన్ని వేల మంది టీచర్లు రిటైరయ్యారు కానీ.. ఒక్కరంటే ఒక్క టీచర్ ని నియమించలేదు. ఒక్క డీఎస్సీ వేయలేదు. కానీ నియామకాలు జరిగే చాన్స్ లేని డీఎస్సీని కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఎన్నికలకు ముందు యువతను మోసం చేయడానికి జగన్ రెడ్డి సిద్దమవుతున్నారని ఈ జాబ్స్ ప్రకటనతోనే స్పష్టమవుతుంది. ఎనభై వేల ఉద్యోగాల ప్రకటన చేసిన నోటిఫికేషన్లు ఇచ్చినా పొరుగు రాష్ట్రంలో కేసీఆర్ ను నమ్మలేదు అక్కడి యువత. పెద్ద పెద్ద మాటలు.. హామీ ఇచ్చి… యువతను పురుగుల్లా చూస్తున్న జగన్ రెడ్డి సర్కార్ ను నమ్మే అవకాశం కూడా ఉండకపోవచ్చు.