తెలంగాణ మూడో శాసనసభ తొలి సమావేశాలను చూసిన వారికి ప్రజాస్వామ్య గొప్పతనం సులువుగానే అర్థమవుతుంది. నాలుగు నెలల క్రితం అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్ష హోదాలో కేవలం ఐదుగురు సభ్యులతో ఉన్న కాంగ్రెస్… ఇప్పుడు 64 మందితో అధికార పక్షంలో ఉంది. పదేండ్లపాటు అధికారపక్షంగా వ్యవహరించిన బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది.
కేసీఆర్ లేకుండానే అసెంబ్లీ జరిగింది. కేటీఆర్ సైతం రాలేదు. ఆ పార్టీకి పెద్ద దిక్కుగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వ్యవహరించారు. ఇక తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదవులను నిర్వర్తించినప్పటికీ… ఒక్కసారి కూడా మంత్రి కాని రేవంత్‌రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. గత సభ వరకూ మాట్లాడేందుకు అవకాశం కోసం, మైకు కోసం ఎదురు చూసిన మల్లు భట్టి విక్రమార్క…ఇప్పుడు సీఎం పక్క స్థానంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు.
గత పదేళ్లలో అసెంబ్లీ ఎప్పుడు జరిగినా .. బీఆర్ఎస్ నేతలదే హడావుడి. ప్రతిపక్ష నేతలకు అవమానాలు ఎదురయ్యేవి. బీజేపీ సభ్యులకు గది కూడా కేటాయించేవారు కాదు. ఇప్పుడు సీన్ రివర్స్అయింది. అలా అని. బీఆర్ఎస్ సభ్యులకు అవమానాలు ఎదురు కావు కానీ.. ప్రజాస్వామ్యంలో రాజులంటూ ఎవరూ ఉండరని.. ప్రజా తీర్పు తర్వాత ఎంతటి వారైనా మామూలు స్థానానికి రావాల్సిందేనని చెబుతున్నారు. ఈ విషయంపై అవగాహన ఉన్నవారు వెంటనే.. మారిపోయి… రాజకీయం చేస్తారు. లేని వాళ్లు మానసికంగా ఇబ్బంది పడతారు.