తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను స్వయంగా పరామర్శిచారు. సహచర మంత్రులు సీతక్క, జూపల్లిలతో కలిసి ఆయన యశోదా ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ చికిత్స పొందుతున్న గదిలోకి వెళ్లి పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం అవసరమైనా అందిస్తామన్నారు.
కేసీఆర్ బాత్ రూంలో జారి పడిన రోజున ఆస్పత్రిలో చేరినట్లు తెలిసిన తర్వాత ఆరోగ్య శాఖ ఉన్నతాధికారిని ఆస్పత్రికి పంపించారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తరపున అందుబాటులో ఉండాలని చెప్పారు. ఆ తర్వాత నేరుగా వెళ్లి పరామర్శించారు. చాలా కాలంగా రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఎదురు పడలేదు. 2018లో ఎమ్మెల్యేగా రేవంత్ ఓడిపోవడంతో అసెంబ్లీలో కూడా ఎదురుపడలేదు. ఏ సందర్భంలోనూ వారు కలవలేదు.
కేసీఆర్ ఆస్పత్రిలో ఉన్న సమయంలో యధృచ్చికంగా పరామర్శకు వెళ్లాల్సి వచ్చింది. ఆస్పత్రిలో కేసీఆర్ తో ఏమైనా మాట్లాడారో లేదో స్పష్టతలేదు. అయితే కేసీఆర్ బలహీనంగా ఉడంటం వల్ల నమస్కాం మాత్రమే పెట్టారని.. పెద్దగా మాట్లాడలేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.